మొదలైన మరో మిస్టరీ వ్యాధి.. టార్గెట్ చిన్నారులే..

చైనా ద్వారా ప్రపంచ దేశాలను వణికించిన కరోనా మెల్లగా తగ్గుతుంది అనుకున్న టైమ్ లో మరో అంతుచిక్కని వ్యాధి మానవాళిని కంగారు పెడుతోంది. ఆఫ్రికా దేశమైన కాంగోలో మిస్టరీ వ్యాధి పెద్ద సమస్యగా మారింది. అక్టోబర్ నెల నుంచి ఇప్పటివరకు ఈ వ్యాధి వల్ల 143 మంది ప్రాణాలు కోల్పోయారని వైద్యులు తెలిపారు. ఇందులో ఐదేళ్ల లోపు పిల్లలే ఎక్కువగా ఉన్నారు. ఫ్లూ లక్షణాల్లాంటి ఈ వ్యాధి చిన్నారులను ప్రధానంగా ప్రభావితం చేస్తోంది.

అయితే, ఈ వ్యాధి ఎందుకు వస్తోంది, ఎలా వ్యాపిస్తోంది అనే విషయాలు వైద్య నిపుణులకే అంతుచిక్కడం లేదు. ఈ వ్యాధిని తాత్కాలికంగా “డిసీజ్ ఎక్స్” అని పిలుస్తున్నారు. డిసీజ్ ఎక్స్ కేసులు ఎక్కువగా క్వాంగో ప్రావిన్స్‌లో నమోదయ్యాయి. ప్రస్తుతం అక్కడ 406 కేసులు గుర్తించారు. అయితే, మరికొందరు ఆసుపత్రికి చేరకుండానే మరణించి ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పేదరికం, పౌష్టికాహార లోపం కారణంగా చిన్నారులు ఈ వ్యాధికి బలవుతున్నారని స్థానిక అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఈ వ్యాధి వ్యాప్తిని అరికట్టడం ప్రస్తుతం అతిపెద్ద సవాలుగా మారింది.

ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ వో) ఈ మిస్టరీ వ్యాధిపై పరిశోధనకు ప్రత్యేక బృందాలను కాంగోకు పంపించింది. రోగుల నుంచి నమూనాలను సేకరించి వ్యాధి మూలాలను, వ్యాప్తి మార్గాలను విశ్లేషిస్తున్నామని డబ్ల్యూహెచ్ వో ప్రకటించింది. వ్యాధి కారకాలను గుర్తించి, దీని నివారణకు అవసరమైన చర్యలు చేపట్టేందుకు ప్రయత్నిస్తున్నామని సంస్థ తెలిపింది. ఈ వ్యాధి ప్రధాన లక్షణాలుగా జ్వరం, తలనొప్పి, ఒళ్లు నొప్పులు, దగ్గు, జలుబు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, రక్తహీనత కనిపిస్తున్నాయి. కాంగోలో పేదరికం కారణంగా ఈ వ్యాధి మరింత తీవ్రతరంగా మారిందని వైద్య నిపుణులు భావిస్తున్నారు. త్వరలో ఈ వ్యాధికి సరైన పరిష్కారం లభిస్తుందని ఆశిస్తున్నారు.