ఈ హైటెక్ జమానాలో దొంగలు కూడా ట్రెండ్ మార్చారు. రాజనాల టైంలో ఇళ్లలో దొంగతనం చేసి నగదు, నగలు దొంగతనం చేసే దొంగలు..రాజమౌళి టైంకి అప్డేట్ అయి ఏకంగా ఆర్టీసీ బస్సులు దొంగతనం చేసే రేంజ్ కు ఎదిగారు. ఇక, తాజాగా తెలంగాణలో ఓ రాజరాజచోరుడైతే ఏకంగా అంబులెన్స్ నే దొంగిలించి దొంగలకే దొంగ అనిపించాడు. సినీ ఫక్కీలో ఎట్టకేలకు ఆ దొంగను పోలీసులు ఛేజ్ చేసి పట్టుకున్న వైనం ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
హైదరాబాద్ లోని హయత్ నగర్ లో ఉండే వెంకట నర్సయ్య చిన్ని చిన్న దొంగతనాలు చేస్తుండేవాడు. చాలాసార్లు పోలీసులకు చిక్కినా..అతడి బుద్ధి మారలేదు. ఈ క్రమంలోనే సన్‌రైజ్ హాస్పిటల్ దగ్గర ఆగి ఉన్న 108 అంబులెన్స్‌ను కొట్టేశాడు. ఆ తర్వాత ఎన్ హెచ్-65పై సైరన్ మోగిస్తూ దూసుకెళ్లాడు. అది గమనించి అంబులెన్స్ సిబ్బంది హయత్‌నగర్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో హైవే పోలీసులు రంగంలోకి దిగారు. చిట్యాల వద్ద పోలీసులు అంబులెన్స్ ను ఆపేందుకు ప్రయత్నించినా ఆపకపోవడంతో వాచు ఛేజ్ చేశారు. ఆ క్రమంలోనే ఏఎస్‌ఐని వెంకట నర్సయ్య ఢీకొట్టి వెళ్లిపోగా ఏఎస్‌ఐ కాలు, ముఖానికి తీవ్రగాయాలై చికిత్స పొందుతున్నారు.
ఆ తర్వాత కొర్లపహాడ్ టోల్‌ప్లాజా బారికేడ్లను, టోల్‌ప్లాజా గేట్‌ను ఢీకొట్టి సూర్యాపేట వైపు వెళ్లాడు. ఆ తర్వాత టేకుమట్ల బ్రిడ్జి వద్ద లారీలను అడ్డుపెట్టి విజయవాడ వైపు వెళ్లే దారిని పోలీసులు మూసేశారు. దీంతో, అంబులెన్స్‌ను రోడ్డు కిందికి దింపాడు. అక్కడే నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.