ఆస్ట్రేలియా దెబ్బ.. ఫైనల్స్ లో భారత్ ఉంటుందా?

భారత జట్టు ఆస్ట్రేలియాతో జరిగిన రెండవ టెస్ట్ మ్యాచ్‌లో 10 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. అడిలైడ్ వేదికగా జరిగిన ఈ పోరులో భారత్ ప్రదర్శన తీవ్రంగా నిరాశపరిచింది. ఈ పరాజయం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) పాయింట్ల పట్టికపై తీవ్ర ప్రభావం చూపింది. రెండుసార్లు ఫైనలిస్ట్‌గా నిలిచిన టీమిండియా ఇప్పుడు మూడవ స్థానానికి పడిపోయింది.

ఈ ఓటమితో టీమిండియా పాయింట్ల శాతం (పీసీటీ) 57.29కి పడిపోయింది. ఈ సారి ఆస్ట్రేలియా 60.71 పాయింట్లతో అగ్రస్థానానికి చేరుకుంది. దక్షిణాఫ్రికా 59.26 పాయింట్లతో రెండవ స్థానంలో నిలిచింది. మూడవ స్థానానికి దిగజారిన భారత్, డబ్ల్యూటీసీ ఫైనల్‌కి అర్హత సాధించడానికి కఠిన పరిస్థితులను ఎదుర్కొంటోంది. శ్రీలంక (50 పీసీటీ) నాలుగో స్థానంలో నిలిచి భారత్‌కు పోటిగా ఉంది.

భారత్ మరో మూడు టెస్ట్ మ్యాచ్‌లను మాత్రమే ఆడనుంది. ఈ మూడు మ్యాచ్‌లను గెలిస్తేనే 64.03 పాయింట్లతో ఫైనల్‌కి చేరుకునే అవకాశం ఉంది. ఒకవేళ ఓటమిని చూస్తే, డబ్ల్యూటీసీ ఫైనల్‌ రేస్‌ నుంచి భారత జట్టు బయట పడుతుంది. అయితే, దక్షిణాఫ్రికా జట్టు ఫలితాలు భారత్ భవిష్యత్తుపై ప్రభావం చూపే అవకాశం ఉంది.

ఆస్ట్రేలియా మిగిలిన మూడు టెస్టులను గెలిస్తే నేరుగా ఫైనల్‌కు చేరుకుంటుంది. మరోవైపు, దక్షిణాఫ్రికా కూడా తమ అన్ని మ్యాచ్‌ల్లో గెలిస్తే 69 పాయింట్లతో ఫైనల్‌కి చేరే అవకాశాలు ఉంటాయి. ఇక భారత్ పైనే కాకుండా శ్రీలంక రూపంలో కూడా పోటీ పెరిగే అవకాశాలు ఉన్నాయి. మరి ఇండియా మిగతా టెస్టుల్లో ఎలాంటి ఫలితాన్ని అందుకంటుందో చూడాలి.