వైభవ్ సూర్యవంశి – గత కొన్ని రోజులుగా ఈ పేరు క్రికెట్ ప్రపంచంలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఐపీఎల్ వేలంలో రాజస్థాన్ అతన్ని కోటి రూపాయలు పెట్టి కొనుగోలు చేసుకుంది. దీంతో ఆ రేంజ్ ధరకు అమ్ముడైన అతిపిన్న వయస్కుడిగా నిలిచాడు. బీహార్‌కు చెందిన ఈ యువ క్రికెటర్ ప్రస్తుతం అండర్-19 ఆసియా కప్‌లో తన దూకుడైన ఆటతీరుతో అందరి దృష్టిని ఆకర్షించాడు. ప్రత్యేకంగా శ్రీలంకపై సెమీఫైనల్‌లో 36 బంతుల్లో 67 పరుగులు సాధించి జట్టును గెలిపించడంలో కీలక పాత్ర పోషించాడు.
ఐపీఎల్ వేలం అనంతరం అతను పాకిస్తాన్ మ్యాచ్ లో దారుణంగా విఫలమయ్యాడు. సింగిల్ డిజిట్ గా అవుట్ అయ్యాడు. ఇక ఆ తరువాత UAE తో జరిగిన మ్యాచ్ ఓపెనర్ గా దిగి 76(46) పరుగులతో నటౌట్ గా నిలిచాడు. అందులో 6 సిక్స్ లు, 4 ఫోర్లు ఉండడం విశేషం.ఇక నేడు శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లోను వైభవ్ వీరబాదుడు బాదాడు.
లంకను తక్కువ స్కోరుకే కట్టడి చేయడంలో భారత బౌలర్లలో ప్రణయ్ సింగ్, రిషి దేవ్ మంచి స్పెల్‌లు వేసి కీలక వికెట్లు తీసారు. అనంతరం 174 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు వచ్చిన భారత ఓపెనర్లు ఆకట్టుకున్నారు. ప్రత్యేకంగా 13 ఏళ్ల వైభవ్ సూర్యవంశి దూకుడైన బ్యాటింగ్‌తో 36 బంతుల్లోనే 67 పరుగులు సాధించాడు. అతని ఇన్నింగ్స్‌లో 6 ఫోర్లు, 5 సిక్సులు ఉన్నాయి. ఒక ఓవర్లో 31 పరుగులు చేసిన వైభవ్ అందరి దృష్టిని ఆకర్షించాడు.
మరో ఓపెనర్ ఆయుష్ మాత్రే 34 పరుగులు చేయగా, కెప్టెన్ మహ్మద్ అమాన్ నాటౌట్‌గా 25 పరుగులు చేసి జట్టును గెలిపించాడు. ఇదే సమయంలో, మరో సెమీఫైనల్‌లో బంగ్లాదేశ్ జట్టు పాకిస్థాన్‌పై 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ విజయం ద్వారా ఫైనల్‌లో భారత్, బంగ్లాదేశ్ మధ్య హోరాహోరీ పోరుకు వేదిక సిద్ధమైంది. ఫైనల్ పోరు ఈ ఆదివారం దుబాయ్ వేదికగా జరుగనుంది. ఇక ఆ మ్యాచ్ లో వైభవ్ ఏ విధంగా ఆడతాడో చూడాలి.