ఒక్క కేదార్ జాదవ్ నలుగురు ఆటగాళ్లకు ఎలా సమానం అవుతాడు.. అదెలా సాధ్యం అనిపిస్తోందా? ఐతే ఐపీఎల్ వెబ్ సైట్లోకి వెళ్లి ఈ ఐదుగురు ఆటగాళ్లను చెన్నై జట్లు వేలంలో ఎంతెంత పెట్టి కొనుగోలు చేసిందో ఒకసారి చూడండి. ప్రస్తుతం చెన్నై జట్టు బ్యాటింగ్ ఆర్డర్లో అత్యంత కీలకంగా ఉన్న డుప్లెసిస్, వాట్సన్, రాయుడులతో పాటు.. ప్రపంచ మేటి స్పిన్నర్లలో ఒకడైన ఆ జట్టు ఆటగాడు తాహిర్.. ఈ నలుగురి మొత్తం రేటు కలిపితే కేదార్ జాదవ్ ధరకు సమానం.
అతణ్ని కొన్నేళ్ల కిందట ఏకంగా రూ.7.6 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది చెన్నై. అప్పటికి అతను మంచి ఫాంలో ఉన్నాడు. టీమ్ఇండియాకు ఆడేవాడు. పైగా బౌలింగ్ కూడా వేసేవాడు. బ్యాటుతో, బంతితో జట్టుకు బాగా ఉపయోగపడతాడని తమ జట్టులోకి తీసుకుంది చెన్నై. ఒకట్రెండు సీజన్లలో పర్వాలేదనిపించాడు కానీ.. ఆ తర్వాత స్థాయికి తగ్గ ప్రదర్శన చేయట్లేదు. కానీ ఒప్పందం ప్రకారం అదే రేటుతో అతణ్ని కొనసాగిస్తూ వస్తోంది చెన్నై.
ఈ సీజన్లోనూ కేదార్‌కు రూ.7.6 కోట్లు చెల్లిస్తోంది చెన్నై. కానీ అతను ఆ జట్టుకు అందులో పదో వంతు కూడా ఉపయోగపడట్లేదు. ఫిట్నెస్ సమస్యలున్న జాదవ్ బౌలింగ్ పూర్తిగా మానేశాడు. ఫీల్డింగ్‌లో కూడా అంతంతమాత్రమే. ఇక బ్యాటింగ్ సంగతి చెప్పాల్సిన పని లేదు. ఈ సీజన్లో బ్యాటింగ్ చేసిన నాలుగు ఇన్నింగ్స్‌ల్లో అతడి స్కోర్లు వరుసగా 22, 26, 3, 7 నాటౌట్. తొలి రెండు మ్యాచ్‌ల్లో డబుల్ డిజిట్ స్కోర్లు చేసినా అవేమీ ఉపయోగపడలేదు. తర్వాతి రెండు మ్యాచ్‌ల్లో ఘోరంగా ఆడాడు.
ముఖ్యంగా బుధవారం రాత్రి కోల్‌కతాతో మ్యాచ్‌లో అతను క్రీజులోకి చవ్చే సమయానికి 21 బంతుల్లో 39 పరుగులు చేయాల్సి ఉండగా.. తొలి మూడు బంతుల్ని డిఫెన్స్ ఆడాడు. మొత్తంగా 12 బంతులాడి 7 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఒక్కటంటే ఒక్క షాట్ ఆడలేకపోయిన జాదవే చెన్నై ఓటమికి కారణమంటూ అతడి మీద అభిమానులు విరుచుకుపడుతున్నారు. మ్యాచ్ పూర్తవడం ఆలస్యం.. అతడి మీద పెద్ద ఎత్తున ట్రోలింగ్ మొదలైంది. ఈ మ్యాచ్‌తో అతడి ఐపీఎల్ కెరీరే ముగిసినట్లే అని.. ఇకపై అతను టీమ్ ఇండియాకు ఆడటమూ కష్టమే అని తేల్చేస్తున్నారు విశ్లేషకులు.