దేశవ్యాప్తంగా హిందీ భాషను రుద్దాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోందంటూ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. తమిళనాట హిందీ భాషను బలవంతంగా రుద్దాలని చూస్తే ఊరుకోబోమని స్టాలిన్ తేల్చి చెప్పారు. ఇలా దేశవ్యాప్తంగా హిందీ భాష వ్యవహారంపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు క్రికెట్ జట్టు ఈ వివాదానికి ఆజ్యం పోసింది. కొత్తగా ఆర్సీబీ హిందీలో ఎక్స్ ఖాతా ఓపెన్ చేయడంతో కన్నడ ప్రజలు మండిపడుతున్నారు. మరి, తెలుగులో ఎందుకు ఎక్స్ ఖాతా ఓపెన్ చేయలేదు అంటూ ప్రశ్నిస్తున్నారు.
ఆర్సీబీకి ఎక్స్ లో ఇంగ్లిష్ తోపాటు కన్నడలో కూడా అఫీషియల్ అకౌంట్లు ఉన్నాయి. కన్నడ ఎక్స్ లో కన్నడ భాషలో మాత్రమే పోస్టులు పెడతారు. ఆర్సీబీ ఇంగ్లిష్ ఎక్స్ అకౌంట్ లో మాత్రం మెజారిటీ పోస్టులు ఇంగ్లిషులో ఉంటాయి. అప్పుడప్పుడు ఆర్సీబీ కన్నడ ఎక్స్ పోస్టులు ఇక్కడ షేర్ చేస్తుంటారు. ఈ క్రమంలో హిందీలో ఎక్స్ అకౌంట్ తెరవడంపై కన్నడ ఆర్సీబీ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ఇది కన్నడ భాషను అవమానించడమేనని వారు అంటున్నారు. హిందీలో పెట్టినప్పుడు తెలుగులో ఎక్స్ ఖాతా ఎందుకు పెట్టరు అని ప్రశ్నిస్తున్నారు.
అయితే, త్వరలోనే మరిన్ని భాషల్లో ఎక్స్ ఖాతాలు తెరవబోతున్నామని ఆర్సీబీ యాజమాన్యం చెబుతోంది. కోట్లాది మంది ఆర్సీబీ అభిమానులకు చేరువయ్యేందుకే హిందీలో పేజ్ ఓపెన్ చేశామని అంటోంది. ఇక, ఆర్సీబీ ఎక్స్ హిందీ అకౌంట్ లో కోహ్లీ హిందీలో మాట్లాడిన వీడియో పెట్టడంతో కన్నడ ఫ్యాన్స్ రకరకాల కామెంట్లు పెడుతున్నారు. ఆర్సీబీలో కన్నడ స్పిరిట్ లేదని, అందుకే ఇలా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది కన్నడ ప్రజలను అవమానించడమేనని కామెంట్లు చేస్తున్నారు.