మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు…మచ్చుకైనా లేడు చూడు….మానవత్వం ఉన్నవాడు…అంటూ పాషాణ హృదయాలతో ఉన్న కరుడుగట్టిన మనుషుల గురించి ప్రముఖ ప్రజా కవి, రచయిత, గాయకుడు గోరటి వెంకన్న ఆర్ధ్రతతో పాడిన పాట మనసున్న మనుషులందరనీ కదిలిస్తూనే ఉంటుంది. కళ్లముందే సాటి మనిషి కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నా…మనకెందుకులే అని కళ్లు మూసుకొని చూసీచూడనట్లు పోతున్న కలికాలం ఇది.
ఇక, వైరల్ వీడియోల పిచ్చిలో పడి ప్రమాదంలో గాయపడిన మనిషి ప్రాణం పోతున్నా సరే పట్టించుకోని కఠినాత్ములున్న రోజులివి. హైదరాబాద్ లో యాక్సిడెంట్ కు గురై తీవ్రంగా గాయపడిన వ్యక్తిని కొందరు వీడియోలు, ఫొటోలు తీసిన వైనం ఆ కోవలోకే వస్తుంది. ప్రమాదానికి గురై కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతన్న క్షతగాత్రుడకి సాయం చేయాల్సిన జనం…ఫొటోలు, వీడియోలు తీసుకుంటున్న వైనం శోచనీయం. కొందరు 108కు ఫోన్ చేసి సమాచారం ఇచ్చి ఫొటోలు, వీడియోలు తీయడంలో నిమగ్నమయ్యారు. 108 వాహనం వచ్చి అతడిని ఆసుపత్రికి తరలించేలోపు అతడు చనిపోయాడు. కీసర అవుటర్ రింగ్ రోడ్డు వద్ద జరిగిన ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయింది.
వరంగల్‌కు చెందిన ఏలేందర్ (35) కీసర రాంపల్లి చౌరస్తాలో నివసిస్తున్నారు. తాను కట్టుకుంటున్న కొత్త ఇంటిని చూసేందుకు స్కూటీపై బయలుదేరిన ఏలేందర్ ను వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది. రోడ్డుపై పడిపోయిన ఏలేందర్ ను చూసి చుట్టుపక్కల జనం కేకలు వేశారు. యాక్సిడెంట్ అయిన కంగారులో లారీ డ్రైవర్ వాహనాన్ని రివర్స్ చేశాడు. దీంతో, ఏలేందర్ కాళ్లు రెండూ నుజ్జునుజ్జు అయ్యాయి. తీవ్ర రక్తస్రావంతో, నొప్పితో ఆర్తనాదాలు చేస్తున్న ఏలేందర్ తనను ఆసుపత్రికి తీసుకెళ్లాలని కన్నీటితో వేడుకున్నారు.
ఆ కన్నీళ్లకు కరగని జనం108కు ఫోన్ చేసి చేతులు దులుపుకున్నారు. ఫొటోలు, వీడియోలు తీస్తూ టైం పాస్ చేశారు. ఆ తర్వాత 108 వాహనం వచ్చి ఏలేందర్ ను ఈసీఐఎల్ చౌరస్తాలోని ఆసుపత్రికి తరలించేసరికే అతడు చనిపోయిన వైద్యులు నిర్ధారించారు.
యాక్సిడెంట్ కు గురైన వారికి గోల్డెన్ అవర్ లో చికిత్స అందించగలిగితే ప్రాణం కాపాడే అవకాశాలు ఎక్కువ అని వైద్యులు చెబుతుంటారు. కానీ, యాక్సిడెంట్ కు గురైన వారిని ఆసుపత్రికి తీసుకువెళితే పోలీసులు తమను స్టేషన్ చుట్టూ తిప్పుతారని, ఆసుపత్రి వాళ్లు, పోలీసులు నానా వివరాలు, ప్రశ్నలు అడుగుతారని చాలామంది ప్రజలు క్షతగాత్రులను తమ సొంత వాహనంలోనో, ఆటోలోనో ఆసుపత్రికి తరలించేంత రిస్క్ చేయరు. అయితే, యాక్సిడెంట్ కేసుల్లో క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించిన వారికి ఎటువంటి ఇబ్బందులు ఉండవని, గతంలో మాదిరి కాకుండా చట్టంలో మార్పులు వచ్చాయని పోలీసులు చెబుతున్నారు. ఈ విషయంపై ప్రజల్లో విస్తృతమైన అవగాహన కల్పించాల్సిన అవసరముంది.