పసికందుల దహనం.. ఇంత నిర్లక్ష్యమా?

ఉత్తరప్రదేశ్‌ ఝాన్సీ జిల్లాలోని మహారాణి లక్ష్మీబాయ్ మెడికల్ కాలేజీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో జరిగిన అగ్నిప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ దుర్ఘటనలో 10 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. మరో 16 మందికి తీవ్ర గాయాలవడంతో ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం సంభవించిన సమయంలో యూనిట్‌లో మొత్తం 52 మంది చిన్నారులు ఉన్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. మంటలు చెలరేగిన వెంటనే తల్లిదండ్రులు తమ పిల్లలను కాపాడే ప్రయత్నం చేశారు, కానీ కొన్ని చిన్నారులను రక్షించలేకపోయారు.

ఈ ఘటన దేశవ్యాప్తంగా ఆందోళనకు దారితీసింది. మెడికల్ కాలేజీల్లో భద్రతా ప్రమాణాలపై మరింత కఠిన చర్యలు అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఘటనపై స్పంసించడంతో విషయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతోంది. ఈ ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం చోటుచేసుకుందని జిల్లా కలెక్టర్ తెలిపారు. అయితే, ఈ ఘటనపై పూర్తి దర్యాప్తు కొనసాగుతోందని అన్నారు.

ప్రమాదానికి కారణంగా ఓ నర్సు నిర్లక్ష్యమే కారణమని, ఆక్సిజన్ సిలిండర్ పక్కన అగ్గిపుల్లలు వెలిగించడం వల్లే మంటలు వ్యాపించాయని అక్కడ ఉన్న భగవాన్ దాస్ అనే వ్యక్తి ఆరోపించారు. ఈ సంఘటనలో తాను నలుగురు పిల్లలను కాపాడానని, మరికొంత మందిని సహాయం తీసుకుని బయటికి తరలించామని ఆయన వివరించారు. ప్రభుత్వం ఈ ఘటనపై సమగ్ర విచారణ చేపట్టేందుకు చర్యలు చేపట్టింది. విచారణ జరుపుతున్నట్లు ఉపముఖ్యమంత్రి బ్రిజేష్ పాఠక్ తెలిపారు.

ఆరోగ్యశాఖ, పోలీసు శాఖలు, జిల్లా యంత్రాంగం సమన్వయంతో దర్యాప్తు కొనసాగుతోంది. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని పాఠక్ హామీ ఇచ్చారు. ఇక ప్రభుత్వం మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల ఎక్స్‌గ్రేషియా, గాయపడిన వారికి రూ. 50 వేల పరిహారం ప్రకటించింది. చిన్నారుల తల్లిదండ్రులు తమ పిల్లలను కోల్పోవడం సహించలేక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాధితుల కుటుంబాలు న్యాయం కోరుతూ ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నాయి.