భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) గత కొన్ని సంవత్సరాలుగా అంతరిక్ష రంగంలో విశేష పురోగతి సాధిస్తూ, ఇతర దేశాలకు శాటిలైట్ ప్రయోగాలలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. అగ్ర దేశాలు సైతం ఇస్రో కాంబినేషన్ లో ప్రయోగాలకు చేతులు కలుపుతుండడంతో సరికొత్త రికార్డులు నమోదవుతున్నాయి. అయితే, ఇటీవల జీశాట్-ఎన్2 అనే భారీ శాటిలైట్‌ను రోదసిలోకి పంపేందుకు అమెరికాకు చెందిన స్పేస్ ఎక్స్ సహకారాన్ని తీసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఇస్రో తన మార్క్-3 రాకెట్ ద్వారా ఇప్పటివరకు 4,000 కిలోల వరకు బరువున్న శాటిలైట్లను మాత్రమే భూస్థిర బదిలీ కక్ష్యలోకి పంపించగలిగింది. కానీ, జీశాట్-ఎన్2 శాటిలైట్ బరువు 4,700 కిలోలుగా ఉండటంతో, ఈ ప్రాజెక్టును స్పేస్ ఎక్స్ ఆధీనంలోని ఫాల్కన్-9 రాకెట్‌కు అప్పగించాలని ఇస్రో నిర్ణయించింది. ఇది ఇస్రో తరఫున స్పేస్ ఎక్స్ ద్వారా చేపట్టబోయే మొదటి ఉపగ్రహ ప్రయోగం కావడం విశేషం.
జీశాట్-ఎన్2 శాటిలైట్ యొక్క ముఖ్య ఉద్దేశం విమాన ప్రయాణికులకు ఇంటర్నెట్ సేవలు అందించడమే కాకుండా, భారతదేశంలోని మారుమూల గ్రామాలకు కూడా హై-స్పీడ్ ఇంటర్నెట్ సేవలను విస్తరించడం. ఈ శాటిలైట్ ద్వారా భారత కమ్యూనికేషన్ వ్యవస్థ మరింత మెరుగుపడుతుందని ఇస్రో అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకు ముందూ ఇస్రో అనేక వాణిజ్య ప్రయోగాలు చేపట్టినప్పటికీ, ఇంత భారీ బరువున్న శాటిలైట్‌ను అంతరిక్షంలోకి పంపే విషయంలో స్పేస్ ఎక్స్ సహాయం కోరడం ఒక కీలకమైన మార్పు.
ఇస్రో, స్పేస్ ఎక్స్ మధ్య ఈ సహకారం అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధనలో భారత స్థాయిని మరింత ఎత్తుకు తీసుకెళ్తుందని భావిస్తున్నారు. స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ ఈ ప్రాజెక్టును ప్రత్యేకంగా అభినందించినట్లు సమాచారం. ఇస్రో చేపట్టబోయే ఈ వాణిజ్య ప్రయోగం అంతర్జాతీయంగా భారత అంతరిక్ష పరిశోధనలో మరో మైలురాయి గా నిలవనుంది.