భారత్ రక్షణలో పవర్ఫుల్ మిసైల్

భారత్ రక్షణ రంగంలో మరో పెద్ద అడుగు వేసింది. దేశీయంగా అభివృద్ధి చేసిన దీర్ఘశ్రేణి హైపర్ సోనిక్ మిసైల్‌ను ఒడిశా తీరంలో విజయవంతంగా పరీక్షించింది. ఈ మిసైల్ 1500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను తుదముట్టించగల సామర్థ్యం కలిగి ఉంది. ఈ విజయాన్ని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చారిత్రాత్మక ఘట్టంగా అభివర్ణించారు. భారత్ అత్యాధునిక మిలటరీ టెక్నాలజీ కలిగిన దేశాల సరసన చేరిందని ఆయన వెల్లడించారు.

మిసైల్ ప్రయోగం పూర్తయ్యాక, దాని గమనం, పనితీరును శాస్త్రవేత్తలు జాగ్రత్తగా విశ్లేషించారు. డౌన్-రేంజ్ షిప్ స్టేషన్ల ద్వారా సేకరించిన డేటా ఆధారంగా మిసైల్ అత్యంత కచ్చితత్వంతో లక్ష్యాన్ని ఛేదించిందని డీఆర్‌డీవో స్పష్టం చేసింది. ఈ క్షిపణిని అత్యాధునిక టెక్నాలజీతో రూపొందించారని పేర్కొంది. హైదరాబాద్‌లోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం మిసైల్ కాంప్లెక్స్ ఈ మిసైల్ అభివృద్ధికి కీలకంగా నిలిచింది.

డీఆర్‌డీవో ల్యాబరేటరీస్, ఇండస్ట్రీ భాగస్వాముల సహకారంతో ఈ మిసైల్ రూపుదిద్దుకుంది. దేశ భద్రతకు ఇది ఎంతో ముఖ్యమైన సాధనమని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. రాజ్‌నాథ్ సింగ్ ఈ విజయానికి శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు, రక్షణ అధికారులు అందరినీ అభినందించారు. “ఇది భారత రక్షణ రంగం బలోపేతానికి తార్కాణం. ఈ విజయం సాంకేతికంగా మరింత ముందుకు తీసుకెళ్తుంది,” అని ఆయన సోషక్ మీడియా ద్వారా తెలిపారు. ఈ విజయంతో, మిలటరీ టెక్నాలజీ రంగంలో భారత్ తన ఆధిపత్యాన్ని మరింత పవర్ఫుల్ గా చూపించింది. హైపర్ సోనిక్ మిసైల్ విజయవంతమైన ఈ పరీక్ష భవిష్యత్తులో రక్షణ రంగానికి మరింత విశ్వాసాన్ని నింపనుంది.