మరో సచిన్ అవుతాడనుకుంటే..

పృథ్వీ షా.. ఈ పేరు ఇంటర్నేషనల్ క్రికెట్ లోకి రాకముందు నుంచే ఇండియాలో బాగా వినిపించింది. స్కూల్ లో ఉండగానే ఒక మ్యాచ్ 546 పరుగులు చేసి క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేశాడు. అనంతరం ప్రముఖ ఇంటర్నేషనల్ ప్లేయర్స్ సైతం అతని గురించి తెలుసుకునే ప్రయత్నం చేశారు. మెల్లగా రంజీల్లోకి రావడంతో అతని దశ తిరిగింది. స్పాన్సర్స్ సైతం చిన్న ఏజ్ లొనే అతనికి సపోర్ట్ చేసేందుకు ముందుకు వచ్చారు.

ఇక ఇండియాకు నెక్స్ట్ సచిన్ అతనే అన్నట్లు డాక్యుమెంటరీలు కూడా పుట్టుకొచ్చాయి. కానీ కాలం గడుస్తున్న కొద్దీ అతని ఆటలో పట్టు తగ్గింది. దానికి తోడు వివాదాలతో క్రమశిక్షణ కోల్పోయాడు. రోడ్డు పై కొట్లాటల వరకు వెళ్లి జనాల చేత కూడా చీవాట్లు తిన్నాడు. సచిన్ తరువాత అతి చిన్న వయసులో టీమిండియాలో చోటు సంపాదించిన పృథ్వీ షా ఎంత వేగంగా వచ్చాడో అంతే వేగంతో ఆటకు దురమవుతున్నాడు.

ఇప్పటికే జాతీయ జట్టుకు దూరమైన అతను తాజాగా ముంబై రంజీ ట్రోఫీ జట్టులో నుంచి కూడా తప్పించబడ్డాడు. ఫిట్‌నెస్ లోపాలు, క్రమశిక్షణ రాహిత్యమే దీనికి ప్రధాన కారణాలుగా తెలుస్తున్నాయి, కొద్ది రోజులుగా అతని ప్రవర్తన, క్రమశిక్షణ లోపాలు జట్టు మేనేజ్‌మెంట్ కు తలనొప్పిగా మారినట్టు సమాచారం. ఇటీవల రంజీ సీజన్‌లో షా బరోడా, మహారాష్ట్ర జట్లపై జరిగిన రెండు మ్యాచ్‌ల్లోనూ పూర్తిగా విఫలమయ్యాడు. ఆడిన ఇన్నింగ్స్‌లలో 7, 12, 1, 39 పరుగులు మాత్రమే చేయడం అతని నిర్లక్ష్యానికి ఉదాహరణగా చెప్పబడుతోంది.

నార్త్ మీడియాల కథనం ప్రకారం, షా తరచూ నెట్ సెషన్‌లకు ఆలస్యంగా రావడంతో పాటు వాటిని సీరియస్‌గా తీసుకోవడం లేదని జట్టు సిబ్బంది పేర్కొంది. ఇప్పటికే అతడు అధిక బరువుతో బాధపడుతున్న నేపథ్యంలో ఈ నిర్లక్ష్యం అతని క్రికెట్ కెరీర్‌పై ప్రభావం చూపిందని అభిప్రాయపడుతున్నారు. జట్టు సహచరులు, ముఖ్యంగా సీనియర్లు శ్రేయాస్ అయ్యర్, అజింక్యా రహానే వంటి ఆటగాళ్లు నెట్ సెషన్‌లలో సీరియస్‌గా ప్రాక్టీస్ చేస్తుంటే, షా మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించడాన్ని కోచ్ కూడా గుర్తించి అతనిపై చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇక క్రమశిక్షణ లోపం కారణంగా జట్టులో స్థానం కోల్పోవడం అతని కెరీర్‌కు ప్రమాదం అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.