కొత్త సినిమాలకు టాక్ ఎలా ఉన్నా.. సక్సెస్ మీట్లు పెట్టేయడం మామూలే. ఐతే ఇప్పుడో చిన్న సినిమాకు చిత్రంగా ‘ఫెయిల్యూర్ మీట్’ పెట్టారు. తమ సినిమా ఫెయిలైందని మీట్ పెట్టడం ఏంటి అని ఆశ్చర్యం కలగొచ్చు. కానీ ‘లవ్ రెడ్డి’ అనే చిన్న సినిమాకు సంబంధించిన యూనిట్ సభ్యులు నిజంగా ‘ఫెయిల్యూర్ మీట్’ పెట్టారు.
అంజన్ రామచంద్ర, శ్రావణి రెడ్డి జంటగా స్మరణ్ రెడ్డి అనే కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందించాడు. ఈ శుక్రవారమే ఈ మూవీ ప్రేక్షకులను పలకరించింది. ఈ నేపథ్యంలో టీం ‘ఫెయిల్యూర్ మీట్’ పెట్టింది. ఇలాంటి పేరుతో మీట్ పెట్టడం వెనుక కారణాలేంటో టీం వివరించింది.
తాము మంచి సినిమా చేశామని.. చూసిన వాళ్లందరూ ఇది మంచి సినిమా అంటున్నారని.. కానీ ఈ చిత్రాన్ని ప్రేక్షకులకు చేరువ చేయడంలో తాము ఫెయిలయ్యామని అందుకే ఈ ఫెయిల్యూర్ మీట్ పెట్టామని టీం వెల్లడించింది.
ఈ రోజుల్లో చిన్న సినిమాలను ప్రేక్షకులు పట్టించుకునేలా చేయడం అంత తేలిక కాదు. ప్రమోషన్లలో ఏదో ఒక వెరైటీ చూపించాల్సిందే. ఈ నేపథ్యంలో ‘లవ్ రెడ్డి’ టీం ఫెయిల్యూర్ మీట్ పేరుతో డిఫరెంటుగా సినిమాను ప్రమోట్ చేస్తోంది. మరి ఈ ప్రమోషన్ సినిమాకు ఏమేర కలిసి వస్తుందో చూడాలి.
అందరూ కొత్త వాళ్లు చేసిన ఈ సినిమాకు పర్వాలేదనే టాక్ వస్తోంది. ఇదొక రొటీన్ లవ్ స్టోరీయే అయినా.. హానెస్ట్ అటెంప్ట్ అనే అభిప్రాయం ప్రేక్షకుల నుంచి వినిపిస్తోంది. చివరి అరగంట.. ముఖ్యంగా క్లైమాక్స్ విషయంలో అందరూ పాజిటివ్‌గా మాట్లాడుకుంటున్నారు.
లీడ్ పెయిర్ పెర్ఫామెన్స్, మ్యూజిక్ గురించి కూడా పాజిటివ్‌గా చెబుతున్నారు. ఇందులో హీరోయిన్‌గా నటించిన శ్రావణి రెడ్డి షార్ట్ ఫిలిమ్స్ ద్వారా మంచి గుర్తింపు సంపాదించింది. ఆమె యువ కథానాయకుడు కిరణ్ అబ్బవరం ఫ్రెండు కావడంతో ఆమె కోసం అతను మూడు షోలను స్పాన్సర్ చేశాడు కూడా.