ఆ విషయంలో బాబుకు అంతగా నచ్చజెప్పాలా?

ఆ విషయంలో బాబుకు అంతగా నచ్చజెప్పాలా?

తెలుగు నేల రెండు ముక్కలైంది. రెండు రాష్ట్రాలుగా విడిపోయింది. నిన్నటి వరకు సొంతూరుగా ఉండే హైదరాబాద్‌ ఇప్పుడు పరాయి ఊరు అయిపోయింది. అన్నింటికి మించి అక్కడ ఖర్చు పెట్టే ప్రతిపైసా తెలంగాణరాష్ట్రానికి చెందుతుంది.

ఒక వ్యక్తిగా విభజన తర్వాత ఎక్కడ ఉండాలన్న నిర్ణయం కారణంగా ఎలాంటి నష్టం వాటిల్లదు. కానీ.. ఏపీ రాష్ట్ర సర్కారుగా తీసుకునే ప్రతి నిర్ణయానికి ప్రభావం కచ్ఛితంగాఉంటుంది. మిగిలిన విషయాల్ని వదిలేసినా.. ప్రతి మూడు నెలలకు ఒకసారి నిర్వహించే అసెంబ్లీ సమావేశాల వ్యవహారమే తీసుకుంటే.. ఈ సమావేశాలు  ప్రతిష్ఠాత్మకమైనవే కాదు.. ఖరీదైనవి కూడా.

విభజన కారణంగా తీవ్రమైన ఆర్థిక సంక్షోభం.. భవిష్యత్తుపై పలు సందేహాలు వ్యక్తం కావటంతో పాటు.. రాజధానినిర్మాణం లాంటి పెద్దపెద్ద సవాళ్లను ఎదుర్కొవాల్సిన సమయంలో రాష్ట్ర సర్కారు.. ముఖ్యమంత్రి రాష్ట్రానికి దూరంగా హైదరాబాద్‌లో ఉండటం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. ఇవాళ రాకున్నా.. చట్టం ప్రకారమైనా పదేళ్లు మాత్రమే హైదరాబాద్‌లో ఉండే వీలుంది.

ఇక.. ఏపీ సర్కారు పెట్టే ప్రతి పైసా ఖర్చుకు సంబంధించిన ఆదాయం తెలంగాణ బక్కసానికే చేరుతుంది. దాని వల్ల ఏపీ సర్కారుకు నష్టమే తప్ప లాభం కాదు. అదే ఖర్చును ఏపీలో పెడితే ఇక్కడ మనీ సర్క్యులేట్‌ అవుతుంది. ఏపీ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్ని తాజాగా నాగార్జున విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీనివల్ల సొంత ప్రాంతంలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించుకుంటున్నామన్న సంతోషం ఏపీ ప్రజల్లో ఉంటుంది. అదే సమయంలో దీని కోసం పెట్టే ఖర్చుకు సంబంధించిన ప్రతిపైసా సీమాంధ్రులకే వెళుతుంది.

అయితే.. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ విషయంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు పూర్తిస్థాయిలో సానుకూలతలో లేరన్న మాట అధికారపక్ష నేతల మాటల్లో స్పష్టంగా ధ్వనిస్తోంది. ''ఆయనెందుకో పెద్దగా ఇష్టపడటం లేదు'' అన్న మాటను తెలుగు తమ్ముళ్లు పదే పదే ప్రస్తావించటం కనిపిస్తుంది.

 తాజాగా నిర్వహిస్తున్న శీతాకాల సమావేశాలతో పాటు.. తర్వాత సమావేశాలు కూడా ఇక్కడే నిర్వహించుకునేలా ముఖ్యమంత్రిని ఒప్పిస్తామని పలువురు అధికారపక్ష నేతలు వ్యాఖ్యానించటం గమనార్హం. సభ్యులందరికి తమ ప్రాంతంలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించుకోవటానికి సుముఖత వ్యక్తం చేస్తుంటే.. చంద్రబాబుకు వచ్చిన ఇబ్బందేమిటి? ఆయన సొంతిల్లు.. కుటుంబం హైదరాబాద్‌లో ఉండటమేనా? ప్రజల మనోభావాల్ని చంద్రబాబు గుర్తించటం లేదా? మిగిలిన నేతలకు కనిపిస్తున్న భావోద్వేగాలు బాబుకు మాత్రం ఎందుకు కనిపించటం లేదో?