బర్రెలక్కగా ప్రచారంలో ఉన్న శిరీష.. గత ఏడాది జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన విషయం తెలిసిందే. జూపల్లి కృష్ణారావు పోటీ చేసిన కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆమె బరిలోకి దిగారు. ఆమెకు ప్రజా సంఘాలు, ఎన్నారైలు, జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ వంటి వారు మద్దతు తెలిపారు. ఇక, యువత పెద్ద ఎత్తున ఆన్ లైన్ ప్రచారం కూడా చేశారు. యానాం మాజీ మంత్రి కృష్ణారావు కూడా.. రూ.2 లక్షలు విరాళంగా ఇచ్చారు. ఇలా అందరూ ఆమెను ప్రోత్సహించారు.
అయితే.. ఆ ఎన్నికల్లో బర్రెలక్క ఓడిపోయారు. ఇక్కడ నుంచి పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి జూపల్లి విజయం దక్కించుకున్నారు. ప్రస్తుతం రేవంత్ మంత్రివర్గంలో ఆయన మంత్రిపదవి కూడా దక్కించుకున్నారు. అయితే.. ఇప్పుడు శిరీష మరింత దూకుడు పెంచారు. పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించారు. తనకు ప్రజాసంఘాలు, స్వచ్ఛంద సంస్థలు మద్దతు ప్రకటించాలని కోరారు. గత ఎన్నికల్లో ఏ సమస్యలపై అయితే.. తాను పోరాటం చేసేందుకు.. ఎన్నికల్లో నిలబడ్డానో.. ఇప్పుడు కూడా అవే సమస్యలపై పోరాటం చేసేందుకు పార్లమెంటుకు వెళ్లాలని అనుకుంటున్నట్టు తెలిపారు.
నాగర్ కర్నూలు పార్లమెంటు స్థానం నుంచి ఇండిపెండెంటుగా బరిలో దిగేందుకు శిరీష సిద్ధమైనట్టు చెప్పారు. అంతేకాదు.. మంగళవారం మంచి ముహూర్తం చూసుకుని ఆమె నామినేషన్ కూడా వేసేశారు. ఇక, నాగర్ కర్నూల్ నియోజకవర్గం నుంచి హేమాహేమీలు బరిలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి దిగ్గజ నాయకుడు మల్లు రవి పోటీ చేస్తున్నారు. బీఆర్ ఎస్ నుంచి రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఆర్ . ఎస్. ప్రవీణ్ కుమార్, బీజేపీ నుంచి పోతుగంటి మహేష్(ఈయన కోటీశ్వరుడు), బీఎస్పీ నుంచి మందా జగన్నాధం(మాజీ మంత్రి) బరిలో ఉన్నారు. మరి వీరిని తట్టుకుని శిరీష గెలుస్తారా? అనేది ప్రశ్న. కానీ, యువతకు మాత్రం ఆమె స్ఫూర్తిగా మరోసారి నిలవనున్నారనేది నిజం.