వైకాపా వాళ్లు మ‌ళ్లీ దొరికిపోయారు

వైకాపా వాళ్లు మ‌ళ్లీ దొరికిపోయారు

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి స‌ర్కారు పాల‌న మొద‌ల‌య్యాక ఎన్నెన్నో చిత్రాలు చూస్తున్నారు అక్క‌డి జ‌నాలు. ఎన్నిక‌ల్లో భారీ విజ‌యం సాధించిన ఉత్సాహంలో ఆ పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు శ్రుతిమించుతున్నార‌న‌డానికి అనేక ఉదాహ‌ర‌ణ‌లే క‌నిపిస్తున్నాయి.

రాష్ట్రంలో ప్ర‌భుత్వ ప్రాప‌ర్టీ ఏది క‌నిపించినా.. దానికి వైకాపా రంగులు అద్దేస్తుండ‌టంపై ఇప్ప‌టికే చాలా విమ‌ర్శ‌లొచ్చిన సంగ‌తి తెలిసిందే. ఇంత‌కుముందు ఓ భ‌వ‌నానికి జాతీయ జెండా రంగులుంటే.. వాటి మీద వైకాపా రంగులేయ‌డంపై పెద్ద దుమార‌మే లేచింది. తీవ్ర విమ‌ర్శ‌ల అనంత‌రం త‌ప్పు దిద్దుకుంటూ జాతీయ జెండా రంగులే వేశారు మ‌ళ్లీ. ఆ వివాదం స‌ద్దుమ‌ణిగింద‌నుకుంటే.. ఇప్పుడు ఇలాంటి గొడ‌వే మ‌రొక‌టి వైకాపాను ర‌చ్చ‌కీడ్చింది.

ఏపీలో ఓ పాఠ‌శాల‌కు వైకాపా రంగులేసిన కార్య‌క‌ర్త‌లు అంత‌టితో ఆగ‌కుండా ఆ భ‌వ‌నం ముందున్న గాంధీ విగ్ర‌హం జోలికి కూడా వెళ్లారు. గాంధీని మాత్రం విడిచిపెట్టి కింద ఉన్న దిమ్మెకు వైకాపా రంగులు పులిమేశారు. గాంధీని కూడా వ‌ద‌ల‌రా అంటూ దీనిపై ఈనాడు ప‌త్రిక‌లో ఒక వార్త కూడా వ‌చ్చింది. దీనిపై సోష‌ల్ మీడియాలో దుమారం రేగింది. ఇటు తెలుగుదేశం అధినేత చంద్ర‌బాబు నాయుడు, జ‌న‌సేన అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ స్పందించారు.

జ‌గ‌న్ స‌ర్కారుకు, వైకాపాకు చుర‌క‌లంటించారు. ఐతే దీనిపై ర‌చ్చ మొద‌ల‌య్యాక వెంట‌నే వైకాపా రంగులు తీసి ముందులాగే తెలుపు రంగు వేయించేశారు. చంద్ర‌బాబు, ప‌వ‌న్ కావాల‌నే దుష్ప్ర‌చారం చేస్తున్నార‌ని.. వాళ్లు చెబుతున్న‌ది అబ‌ద్ధ‌మ‌ని వైకాపా ట్విట్ట‌ర్ అకౌంట్లో అధికారికంగానే విమ‌ర్శ‌లు చేశారు. కానీ గాంధీ విగ్ర‌హం కింద వైకాపా రంగులు ప‌డ్డ స‌మ‌యంలో వీడియో తీసిన వాళ్లు దాన్ని సోష‌ల్ మీడియాలోకి తేవ‌డంతో వైకాపా ప‌రువు పోయింది. త‌ప్పు చేసి దాన్ని క‌వ‌ర్ చేసుకోవ‌డం గురించి తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English