బీజేపీ అడ్రెస్ మీ చెల్లికి తెలుసు కేటీఆర్ - బీజేపీ

బీజేపీ అడ్రెస్ మీ చెల్లికి తెలుసు కేటీఆర్  - బీజేపీ

తెలంగాణ‌లో అధికార టీఆర్ఎస్ పార్టీ, ప్ర‌తిప‌క్ష‌బీజేపీ మ‌ధ్య మాట‌ల యుద్ధం తీవ్ర‌స్థాయికి చేరుతోంది. తెలుగు రాష్ట్రాలు అందులో తెలంగాణ‌పై ప్ర‌త్యేక ఫోక‌స్ పెట్టిన బీజేపీ పెద్ద‌లు ఇందులో భాగంగా ఆదివారం భారీ స్థాయిలో నేత‌ల‌కు కండువా క‌ప్పారు. ఈ సంద‌ర్భంగా పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ న‌డ్డా టీఆర్ఎస్ తీరును తీవ్రంగా త‌ప్పుప‌ట్టారు. దానిపై టీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విరుచుకుప‌డ్డారు. ఈ విమ‌ర్శ‌ల ప‌ర్వంలోకి...కేసీఆర్ కుమార్తె క‌విత ప్ర‌స్తావ‌న రావ‌డం గ‌మ‌నార్హం.

బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎన్నికైన తర్వాత తొలిసారి హైద‌రాబాద్‌కు వ‌చ్చిన నడ్డా ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన స‌భ‌లో మాట్లాడుతూ,  రాష్ట్రంలో అధికారంలోకి వస్తామని, పక్కా వాస్తు అంటే ఏమిటో కేసీఆర్కు అర్థమయ్యేలా చూపిస్తామని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో అవినీతి పాలన కొనసాగుతోందని, కమీషన్ల కోసమే ఇక్కడి ప్రభుత్వం పనిచేస్తోందని ఆరోపించారు. రూ. 30వేల కోట్లతో పూర్తి చేయాల్సిన కాళేశ్వరం ప్రాజెక్టు వ్యయాన్ని రెండింతలు పెంచి రూ. 80వేల కోట్లకు చేశారని, దీని వెనుక భారీ అవినీతి దాగి ఉందని ఆరోపించారు. కమీషన్ల కోసమే టీఆర్ఎస్ సర్కార్ పనిచేస్తోందని నడ్డా ఆరోపించారు. ‘‘కేసీఆర్ దగ్గరున్న గిన్నె నిండా రంధ్రాలుంటాయి. పైనుంచి ఎంత వేస్తే.. అంత కిందికి కమీషన్లుగా వెళ్తుంది” అన్నారు.

దీనిపై కేటీఆర్ స్పందిస్తూ, తెలంగాణ అడ్డాలో బీజేపీ నడ్డా నాటకాలు సాగ‌వ‌ని అన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల‌  మంత్రులు, అధికారులు తెలంగాణలోని పథకాలను ప్రశంసిస్తుంటే.. నడ్డాకు కనిపించడం లేదా? అని ప్ర‌శ్నించారు. ``బీజేపీ నేతలు నోటికొచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదు. కర్ణాటకలో బీజేపీ చేసిన నాటకాలు ఇక్కడ సాగవు. ఇది కర్ణాటక కాదు.. తెలంగాణ అని బీజేపీ నేతలు గుర్తుంచుకోవాలి``. అని హెచ్చ‌రిక వంటి సూచ‌న చేశారు.

కేటీఆర్ కామెంట్ల‌పై తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు ల‌క్ష్మ‌ణ్ స్పందిస్తూ, నడ్డా ఎవరో తెలియదని కేటీఆర్ అనడం.. ఆయ‌న అహంకారాన్ని తెలుపుతోందన్నారు. కేటీఆర్ లాగా నడ్డా ప్యారాచూట్ పట్టుకొని రాజకీయాల్లోకి రాలేదన్నారు. కేటీఆర్ లాగా తండ్రి పేరు చెప్పుకుని రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి నడ్డా కాదన్నారు. కేటీఆర్ పుట్టక ముందే నడ్డా రాజకీయాల్లో ఉన్నారని కౌంటర్ ఇచ్చారు. నడ్డా కల్వకుంట్ల కుటుంబ బిడ్డ కాదు, భారతమాత ముద్దుబిడ్డ అనీ అన్నారు. బీజేపీ అడ్ర‌స్ ఎక్క‌డ ఉందో అని ప్ర‌శ్నించిన కేటీఆర్‌పై ఈ సంద‌ర్భంగా ల‌క్ష్మ‌ణ్ సెటైర్లు వేశారు.` కేటీఆర్.. నిజామాబాద్ వెళ్లి మీ చెల్లి కవితని అడిగితే బీజేపీ ఎక్కడుందో చెపుతుంది” అని లక్ష్మణ్ వ్యాఖ్యానించారు.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English