గత ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిన్నాన్న వైఎస్ వివేకా హత్య ఎంతటి సంచలనం రేపిందో తెలిసిందే. అప్పుడు అది ఎన్నికల అంశంగా మారి.. జగన్ పట్ల సానుభూతికి కారణమైంది. ఐతే ఇప్పుడు కూడా వివేకా హత్య కేసు ఎన్నికల అంశమే. కాకపోతే అప్పుడు జగన్‌కు కలిసొచ్చిన ఆ కేసు.. ఇప్పుడు ఆయనకు ప్రతికూలంగా మారింది. జగన్ సోదరుడైన అవినాష్‌పై ఈ కేసుకు సంబంధించి తీవ్ర అభియోగాలు రావడం.. జగన్ మద్దతుతోనే అవినాష్ ఈ హత్య చేయించినట్లు ఆరోపణలు రావడం రాజకీయంగా వైసీపీకి ఇబ్బందిగా మారుతోంది. కడప పార్లమెంట్ స్థానంలో అవినాష్ మీద పోటీ చేస్తున్న వైఎస్ షర్మిళ ఇదే అంశాన్ని పదే పదే లేవనెత్తుతూ వైసీపీలో గుబులు రేపుతోంది.
ఈ నేపథ్యంలో జగన్ తన తాజా ప్రసంగంలో షర్మిళతో పాటు వివేకా తనయురాలైన సునీత తీరును తీవ్రంగా తప్పుబట్టారు. వారి పేర్లు ఎత్తకుండా.. ప్రత్యర్థులతో చేతులు కలిపిన తన చెల్లెళ్లు వైఎస్ ఆశయాలకు తూట్లు పొడుస్తున్నారని జగన్ ఆరోపించారు. వివేకాను హత్య చేయించింది ఎవరో కడప జిల్లా ప్రజలందరికీ తెలుసన్న జగన్.. ఆ హత్య చేసిన వ్యక్తికే తన చెల్లెళ్లు అండగా నిలుస్తున్నారని ఆరోపించారు జగన్. ఇదే సందర్భంలో వివేకాకు రెండో పెళ్లి జరగడం, ఆ పెళ్లి ద్వారా ఆయనకు ఒక కొడుకు కూడా ఉన్న విషయాన్ని జగన్ లేవనెత్తి.. ఆయన హత్యకు రెండో పెళ్లికి సంబంధం ఉందనే కోణంలో మాట్లాడారు.
వైఎస్ బతికున్నంత కాలం ఆయన, తన అభిమానులు ఎవరితో అయితే పోరాడారో ఆ చంద్రబాబు కోసం ఇప్పుడు తన చెల్లెళ్లు ఇద్దరూ కలిసి పని చేస్తున్నారని.. రాజకీయాల్లో ఇంతకంటే దిగజారుడుతనం ఇంకోటి ఉంటుందా అని జగన్ ప్రశ్నించారు. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించి, ప్రత్యేక హోదాను విభజన చట్టంలో చేర్చకుండా మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తూ కడప జిల్లాలో ఓట్లు చీల్చి.. వైఎస్ పేరుతో నెలకొల్పి, ఆయన్ని అన్ని రకాలుగా గౌరవించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి నష్టం చేయాలని చూస్తోందంటూ తన చెల్లెలి తీరును జగన్ తప్పుబట్టారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates