400 కోట్లతో కేసీఆర్ కోరిక...రెండేళ్ల రికార్డు

400 కోట్లతో కేసీఆర్ కోరిక...రెండేళ్ల రికార్డు

తెలంగాణ ముఖ్య‌మంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత త‌న `కోరిక‌` కోసం రూ.400 కోట్ల ప్ర‌జాధ‌నం ఖ‌ర్చు చేసే ప్ర‌క్రియ‌ మ‌రి కొన్ని గంట‌ల్లో జ‌ర‌గ‌నుంది. రూ.400 కోట్ల  వ్యయంతో నిర్మించే కొత్త సెక్రటేరియట్‌కు ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం భూమిపూజ చేయనున్నారు. 11 గంటలకు డి-బ్లాక్ ప్రాంతంలో కొత్త సెక్రటేరియట్ భవన నిర్మాణానికి.. ఈశాన్య మూలన శంకుస్థాపన చేయనున్నారు. కార్యక్రమంలో మంత్రులు, అధికారులు పాల్గొంటారు. సెక్రటేరియట్ నిర్మాణంపై హైకోర్టులో కేసు ఉండడంతో తక్కువ మందితో మాత్రమే శంకుస్థాపన చేస్తున్నట్లు సెక్రటేరియట్ అధికారులు తెలిపారు. దాదాపు రెండున్నరేళ్ల తర్వాత భూమిపూజ కోసమే కొత్త సెక్రటేరియట్‌కు కేసీఆర్ వస్తుండ‌టం గ‌మ‌నార్హం.

గురువారం ఉదయం 10 గంటలకు సీఎం కేసీఆర్ ముందుగా సచివాలయ భవననిర్మాణానికి భూమిపూజచేస్తారు. ఇందుకోసం సచివాలయంలో ఈశాన్యంలో డీ బ్లాక్ వెనుక వైపు ఉన్న ఉద్యానవనంలో ఏర్పాట్లుచేస్తున్నారు. అనంతరం ఎర్రమంజిల్‌లో అసెంబ్లీ భవన నిర్మాణపనులకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ప్రగతిభవన్‌లో లంచ్ ఏర్పాటుచేశారు. నూతన సచివాలయాన్ని సుమారు ఆరులక్షల చదరపు అడుగుల వైశాల్యంతో అన్నిహంగులతో నిర్మించాలని ప్రభుత్వం భావిస్తున్నది.

పక్కావాస్తుతోపాటు అన్నిరకాల వసతులు ఉండేలా నిర్మించనున్నారు. మంత్రులు, అధికారుల సమీక్షలు, సమావేశాలు అన్నీ సచివాలయం వేదికగా జరిగేలా నిర్మాణం జరుగనుంది. ఇందుకోసం సమావేశహాళ్లు, కలెక్టర్ల సమావేశం కోసం కాన్ఫరెన్స్‌హాల్ నిర్మించనున్నారు. అలాగే విశాలమైన పార్కింగ్ ఏర్పాటు కూడా చేయనున్నారు. పూర్తి పర్యావరణ హితంగా సచివాలయాన్ని నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం సచివాలయం ప్రాంగణంలో ఉన్న భారీ వృక్షాలను ట్రాన్స్‌రిలోకేషన్ పద్ధతిలో సంరక్షించాలని అధికారులు యోచిస్తున్నారు.

స‌చివాల‌యం కూల్చివేత‌, నూత‌న స‌చివాల‌యం నిర్మాణం విష‌యంలో కేసీఆర్ స‌ర్కారు ఆచితూచి అడుగువేస్తోంది. ప్రస్తుతం సచివాలయంలోని కార్యాలయాలను తాత్కాలికంగా ఎక్కడకు తరలించాలి? మొత్తం సచివాలయ భవనాలను ఒకేసారి కూల్చివేయాలా? లేక విడుతలవారీగా కూల్చాలా? అన్నదానిని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి నేతృత్వంలోని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయిస్తుంది. మొత్తం కార్యాలయాలను ఒకేసారి తరలించకుండా మొదట ఏ, బీ, సీ బ్లాక్‌లలోని కార్యాలయాలను ఎల్, జే, డీ బ్లాక్‌లకు తరలించి.. ఏ,బీ,సీ,కే బ్లాక్‌లను కూల్చివేయాలని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఈ మూడుబ్లాక్‌లు కలిపితే 5.6 లక్షల చదరపు అడుగులు ఉంటుందని చెప్తున్నారు.

అయితే నిర్మాణ సమయంలో ఈ స్థలంలోని ఇతర బ్లాక్‌లలో కార్యాలయాలు ఉండటం భద్రత కారణాలరీత్యా మంచిది కాదన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. భవనాలు అన్నింటినీ ఒకేసారి కూల్చకుండా.. విడుతల వారీగా కూల్చి నిర్మాణం చేపడితే .. భారీయంత్రాలను వినియోగించి రెండోవిడుతలో నిర్మించే భవనాలను కూల్చేసమయంలో మొదటి విడుతలో నిర్మించిన భవనాలకు పగుళ్లు వచ్చే ప్రమాదం ఉంటుందని మరో ఆలోచన కూడా చేస్తున్నారు. ఈ విధంగా అన్నిరకాల విషయాలపై మంత్రివర్గ ఉపసంఘం చర్చించి సచివాలయ తరలింపుపై నిర్ణయిం తీసుకోనున్నది. మంత్రివర్గ ఉపసంఘం ఇచ్చే నివేదిక ఆధారంగా సచివాలయంలోని కార్యాలయాలను తరలింపుపై నిర్ణయం తీసుకుంటారని స‌మాచారం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English