గాలి కుటుంబం కూసాలు క‌దిలాయి

గాలి కుటుంబం కూసాలు క‌దిలాయి

గాలి హ‌వా పూర్తిగా అదృశ్యం అయ్యింది. చాలాకాలం గాలి కంచుకోట‌గా మారిన బ‌ళ్లారి లోక్‌స‌భ స్థానం సుమారు ప‌దిహేనేళ్ల త‌ర్వాత కాంగ్రెస్ గెలుచుకుంది. కర్ణాటక ఉపఎన్నికల్లో బీజేపీకి ఘోర పరాభవం ఎదురైంది. ఉప ఎన్నిక‌ల్లో  కాంగ్రెస్-జేడీఎస్ కూటమి హ‌వా ముందు కాషాయపార్టీ కూలబడింది. మూడు లోక్‌సభ, రెండు శాసనసభ స్థానాలు సహా ఐదు స్థానాల్లో కాంగ్రెస్-జేడీఎస్ కూటమికి విజయం దాదాపు ఖరారైంది.

ఇక బీజేపీ కంచుకోట అయిన‌ శివమొగ్గలో చ‌చ్చీచెడి బీజేపీ బ‌తుకీడుస్తోంది. ఇంకా ఫ‌లితాలు అక్క‌డ పూర్తిగా వెలువ‌డ‌నందున స్వల్ప మెజారిటీతో అక్క‌డ మాత్రం బీజేపీకి ఉప‌శ‌మ‌నం క‌లిగే అవ‌కాశం క‌నిపిస్తోంది.  జమఖండి అసెంబ్లీ సీటు, బళ్లారి లోక్‌సభ స్థానంలో కాంగ్రెస్ భారీ మెజారిటీతో విజయం సాధించింది. ఇంకా ఫ‌లితాలు వెలువ‌డ‌క‌పోయినా... మెజారిటీ గ్యాప్ చాలా ఎక్కువ ఉండ‌టంతో ఇక బీజేపీ గెలిచే అవ‌కాశ‌మే లేదు.  మరో వైపు మాండ్య లోక్‌సభ స్థానం మ‌ళ్లీ జేడీఎస్ ద‌క్కించుకుంది. రామనగరం అసెంబ్లీ స్థానంలో సీఎం భార్య అనిత భారీ ఆధిక్యంతో ఉంది. అనితా కుమారస్వామి లక్షకు పైగా ఓట్ల భారీ ఆధిక్యంలో కొనసాగుతుండ‌టం విశేషం.

ఈ ఎన్నిక‌ల ఫ‌లితాలు కాంగ్రెస్‌కు కొత్త ఊపును తెచ్చిపెట్టాయి. ప‌లు రాష్ట్రాల్లో ఎన్నిక‌లు జ‌రుగుతున్న నేప‌థ్యంలో ఇది ప్ర‌జ‌ల మూడ్‌కు ఉదాహ‌ర‌ణ అని కాంగ్రెస్ సంబ‌రాలు చేసుకుంటోంది. బీజేపీ రాజ‌కీయాల‌ను ప్ర‌జ‌లు సహించ‌డం లేద‌ని పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వాన్ని కూలదోసే  బీజేపీ ప్ర‌య‌త్నాల‌కు ఇది హెచ్చ‌రిక అని కుమార‌స్వామి, దేవెగౌడ వ్యాఖ్యానించారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English