అఖిల‌ప్రియ‌కు చేసిన‌ట్లే కిడారి కుమారుడికి?

అఖిల‌ప్రియ‌కు చేసిన‌ట్లే కిడారి కుమారుడికి?

మావోయిస్టుల కాల్పుల్లో మృతిచెందిన అర‌కు ఎమ్మెల్యే కిడారి స‌ర్వేశ్వ‌ర‌రావు పెద్ద కుమారుడు కిడారి శ్రావ‌ణ్ కుమార్ త్వ‌ర‌లో మంత్రి ప‌ద‌వి చేప‌ట్ట‌నున్న‌ట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కిడారి త‌న‌యుణ్ని మంత్రివ‌ర్గంలోకి తీసుకుంటే.. గిరిజ‌నుల్లోకి టీడీపీపై సానుకూల సంకేతాలు వెళ్తాయ‌ని సీఎం చంద్ర‌బాబు భావిస్తున్నార‌ట‌. అందుకే సాధ్య‌మైనంత త్వ‌ర‌గా.. వీలైతే ఈ నెల‌లోనే  శ్రావ‌ణ్‌కు చోటు క‌ల్పించాల‌ని ముఖ్య‌మంత్రి యోచిస్తున్నార‌ని తెలుస్తోంది.

కిడారి శ్రావ‌ణ్ కుమార్ ఉన్న‌త‌ విద్యావంతుడు. ఐఐటీలో ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. కాబ‌ట్టి ఆయ‌న‌కు మంత్రి ప‌ద‌వి క‌ట్ట‌బెడితే పెద్ద‌గా స‌మ‌స్య‌లేవీ ఉండ‌క‌పోవ‌చ్చ‌ని చంద్ర‌బాబు భావిస్తున్న‌ట్లు స‌మాచారం. ఇక్క‌డ గ‌మ‌నించాల్సిన మ‌రో విష‌య‌మేంటంటే.. చంద్ర‌బాబు ప్ర‌స్తుత మంత్రివ‌ర్గంలో గిరిజ‌నులు ఒక్క‌రు కూడా లేరు. దీనిపై ప‌లువురు విప‌క్ష నేత‌లు ఇప్ప‌టికే విమ‌ర్శ‌లు గుప్పించారు కూడా. శ్రావ‌ణ్‌కు అవ‌కాశ‌మిస్తే.. ఆ విమ‌ర్శ‌ల‌కు కూడా అడ్డుక‌ట్ట వేసిన‌ట్ల‌వుతుంది. గిరిజ‌నుల్లోకి చంద్ర‌బాబుపై, టీడీపీపై సానుకూల సంకేతాలు వెళ్లే అవ‌కాశ‌ముంది.

గ‌త నెల్లో కిడారి హ‌త్య చోటుచేసుకున్న‌ప్పుడు చంద్ర‌బాబు అమెరికా ప‌ర్య‌ట‌న‌లో ఉన్నారు. అక్క‌డి నుంచి తిరిగిరాగానే.. కిడారి కుటుంబాన్ని ప‌రామ‌ర్శించారు. వారికి భారీగా ఆర్థిక సాయం ప్ర‌క‌టించారు. కిడారి చిన్న కుమారుడికి గ్రూప్-1 ఉద్యోగం క‌ల్పిస్తామ‌ని హామీ ఇచ్చారు. పెద్ద కొడుకు శ్రావ‌ణ్‌కు ఏం చేయాల‌న్న‌దానిపై పార్టీలో చ‌ర్చించి నిర్ణ‌యం తీసుకుంటాన‌న్నారు. దీంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో శ్రావ‌ణ్ అర‌కు నుంచి పోటీ చేయ‌డం ఖాయ‌మ‌ని అంతా భావించారు. అయితే, శ్రావ‌ణ్‌కు ఏకంగా మంత్రి ప‌ద‌వి ఇచ్చేందుకు సీఎం ముందుకొస్తుండ‌టం ఆశ్చ‌ర్య‌క‌ర‌మే.

గతంలో సీనియ‌ర్ నేత‌ భూమా నాగిరెడ్డిని మంత్రివర్గంలోకి తీసుకోవాలని చంద్ర‌బాబు భావించగా.. ఆయన ఆకస్మికంగా మరణించారు. దీంతో ఆయ‌న కుమార్తె అఖిలప్రియకు మంత్రివ‌ర్గంలో సీఎం అవకాశం కల్పించారు. ఆ నిర్ణ‌యం రాయలసీమలో పార్టీకి సానుకూల పరిణామంగా మారింది. అదే త‌ర‌హాలో ఇప్పుడు శ్రావణ్‌కు మంత్రివర్గంలో అవకాశమిస్తే గిరిజన వర్గాల నుంచి మంచి ఆదరణ లభిస్తుందని చంద్ర‌బాబు యోచిస్తున్న‌ట్లు తెలుస్తోంది. మ‌రోవైపు, మైనారిటీ కోటా నుంచి శాసనమండలి ఛైర్మన్‌ ఎన్‌.ఎం.డి.ఫరూక్‌ను మంత్రిగా చేసే అవ‌కాశాల‌నూ సీఎం ప‌రిశీలిస్తున్న‌ట్లు స‌మాచారం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English