గూగుల్ గుప్పిట్లో యూజ‌ర్ల గుట్టు?

గూగుల్ గుప్పిట్లో యూజ‌ర్ల గుట్టు?

ఈ ఇంట‌ర్నెట్ జ‌మానాలో కంప్యూట‌ర్లు, స్మార్ట్ ఫోన్ల‌తో మ‌న జీవితాలు పెన‌వేసుకుపోయాయంటే అతిశ‌యోక్తి కాదు. ఒక్క‌మాట‌లో చెప్పాలంటే మ‌న మునివేళ్ల‌తో ప్ర‌పంచాన్ని చుట్టేయొచ్చు. స్మార్ట్ ఫోన్ ను ఉప‌యోగించి మ‌న చిటికెన వేలుతో చిటికెలో కావాల్సిన వ‌స్తువును ఇంటికి తెప్పించుకోవ‌చ్చు. ఓర‌కంగా చెప్పాలంటే మ‌నలో చాలామంది వాస్త‌వ ప్ర‌పంచానికన్నా ఆన్ లైన్ కే ఎక్కువ క‌నెక్టయ్యామ‌నేది అంగీక‌రించాల్సిన వాస్తవం.

అయితే, మ‌నం ఉప‌యోగిస్తున్న స్మార్ట్ ఫోన్ పై ఎవ‌రో నిఘా పెట్టిన‌ట్లు ఎపుడైనా అనిపించిందా? ఆన్ లైన్ లో బుక్ చేసే టికెట్ల ద‌గ్గ‌ర నుంచి ఆర్డ‌ర్ చేసే ఫుడ్ వ‌ర‌కు....మ‌నం సెర్చ్ చేసే వ‌స్తువుల‌కు సంబంధించిన వివ‌రాల‌తో స‌హా అన్నీ వేరెవ‌రో తెలుసుకుంటున్నార‌న్న అనుమానం క‌లిగిందా?  మ‌న‌కు సంబంధించిన వ్య‌క్తిగ‌త వివ‌రాలను ఎవ‌రో త‌స్క‌రిస్తున్నార‌న్న ఆలోచ‌న వ‌చ్చిందా? ఈ ప్ర‌శ్న‌ల‌న్నింటికీ దాదాపుగా అవున‌నే స‌మాధానం వినిపిస్తుంది. ఆ ప్ర‌శ్న‌ల‌కు టెక్ ఎక్స్ ప‌ర్ట్ అయిన డైల‌న్ అనే ఓ వ్య‌క్తి ట్విట్ట‌ర్ ద్వారా ఇచ్చిన జ‌వాబులు మ‌నంద‌రినీ షాక్ కు గురి చేయ‌క మాన‌వు.

ఫేస్ బుక్ లో డేటా భ‌ద్ర‌త‌లోని డొల్ల‌త‌నం బ‌య‌ట‌ప‌డ‌డం సంచ‌ల‌నం రేపిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో, తాజాగా డైల‌న్ ....గూగుల్ మ‌న డేటాను ఎలా త‌స్క‌రిస్తుందో 30 త్రెడ్ ల ద్వారా వివ‌రించారు. వాస్త‌వానికి, మ‌నం స్మార్ట్ ఫోన్ లో లాగిన్ అవ్వ‌డానికి దాదాపుగా జీ మెయిల్ ఐడీ అవ‌స‌రం. ఒక వేళ దానిని స్కిప్ చేస్తే కొన్ని ఫీచ‌ర్స్ ప‌నిచేయ‌వ‌ని దాదాపుగా ప్ర‌తి మొబైల్ కంపెనీ హెచ్చరిస్తుంది. ఈ రెండు సంద‌ర్భాల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంటే....స‌గ‌టు స్మార్ట్ ఫోన్ యూజ‌ర్ కు గూగుల్ పై ఆధార‌ప‌డ‌కుండా పూట గ‌డ‌వ‌దు.

దీంతో, గూగుల్ లో మ‌న‌కు కావాల్సిన స‌మాచారం సెర్చ్ చేయ‌డం, లేదంటే ఆన్ లైన ద్వారా కొనుగోళ్లు చేయ‌డం వంటివిచేస్తుంటాం. నెటిజ‌న్లు ముద్దుగా పిలుచుకునే `గూగుల్ త‌ల్లి` మ‌న‌కు సంబంధించిన విష‌యాల‌న్నీ భ‌ద్ర‌ప‌రుచుకుంటుంది. అయితే, గూగుల్ ....మ‌న డేటాను, వ్య‌క్తిగ‌త స‌మాచారాన్ని భ‌ద్ర‌ప‌రుచుకుంటున్న‌ట్లు మ‌న‌కు కూడా తెలియ‌ద‌ని డైల‌న్ చెబుతున్నారు.

మ‌నం ఫోన్ కొని లాగిన్ అయిన‌ప్ప‌టి నుంచి మ‌న లొకేష‌న్ ను గూగుల్ భ‌ద్ర‌ప‌రుచుకుంటుంది. అంతేకాకుండా, ఇప్ప‌టివర‌కు మ‌నం వాడిన అన్ని కంప్యూట‌ర్లు, ఫోన్ల‌లో సెర్చ్ హిస్ట‌రీని ప్ర‌త్యేక డేటాబేస్ లో భ‌ద్ర‌ప‌రుచుకుంటుంద‌ట‌. అందువ‌ల్ల మ‌నం ఏదో ఒక డివైజ్ లో సెర్చ్ హిస్ట‌రీ డిలీట్ చేస్తే స‌రిపోద‌ట‌. మ‌నం లాగిన్ అయిన అన్ని డివైజ్ ల‌లో ఆ హిస్ట‌రీని డిలీట్ చేయాల్సి ఉంటుందట‌. అంతేకాకుండా, ఫేస్ బుక్, ట్విట్ట‌ర్, యూట్యూబ్ లతో స‌హా మ‌నం వాడే థ‌ర్డ్ పార్టీ యాప్ ల‌ హిస్ట‌రీని కూడా గూగుల్ సేవ్ చేసుకుంటుంద‌ట‌.

అందులో మ‌న అభిరుచులు, మ‌త విశ్వాసాలు వంటి స‌మాచారాన్ని సేక‌రిస్తుంద‌ట‌. గూగుల్ క్యాలెండ‌ర్ .... మ‌న‌కు సంబంధించిన ముఖ్య‌మైన తేదీల‌ను, మ‌నకు సంబంధించిన డాక్యుమెంట్లు గూగుల్ డ్రైవ్ సేవ్ చేసుకుంటుంద‌ట‌. మ‌నం డ్రైవ్ లో డిలీట్ చేసిన‌ప్ప‌టికీ ఆ డాక్యుమెంట్లు డ్రైవ్ డేటాలో ఉంటాయ‌ట‌. ఫేస్ బుక్ త‌ర‌హాలోనే `గూగుల్ ` గుప్పిట్లో మ‌న వ్య‌క్తిగ‌త స‌మాచారం, జాత‌కం మొత్తం ఉంటుంద‌ని డైల‌న్ బ‌ల్ల‌గుద్ది మ‌రీ చెబుతున్నాడు. మ‌రి ఫేస్ బుక్ త‌ర‌హాలో గూగుల్ గుట్టు కూడా భ‌విష్య‌త్తులో రట్ట‌వుతుందేమో వేచి చూడాలి!

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు