తీన్మార్ మ‌ల్ల‌న్న‌కు కాంగ్రెస్ రిటర్న్ గిఫ్ట్

క‌రీంన‌గ‌ర్ ఎంపీగా కాంగ్రెస్ నుంచి పోటీ చేయాల‌ని భావించిన తీన్మార్ మ‌ల్ల‌న్న అలియాస్ చింత‌పండు న‌వీన్‌కు ఆ టికెట్ ద‌క్క‌క‌పోయినా ఊర‌ట మాత్రం ల‌భించింది. క‌రీంన‌గ‌ర్ టికెట్‌ను ఇవ్వ‌ని కాంగ్రెస్‌.. ఎమ్మెల్సీ అభ్య‌ర్థిగా మాత్రం పోటీ చేసే అవ‌కాశాన్ని తీన్మార్ మ‌ల్ల‌న్న‌కు క‌ల్పించింది. న‌ల్గొండ‌-వ‌రంగ‌ల్‌-ఖ‌మ్మం ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక‌ల్లో తీన్మార్ మ‌ల్ల‌న్న బ‌రిలో దిగ‌నున్నారు.

క‌రీంన‌గ‌ర్ లోక్‌స‌భ స్థానంలో కాంగ్రెస్ సీటు కోసం ప్ర‌వీణ్‌రెడ్డి, వెలిచాల రాజేంద‌ర్‌రావు, తీన్మార్ మ‌ల్ల‌న్న త‌దిత‌రులు పోటీప‌డ్డారు. తీన్మార్ మ‌ల్ల‌న్న ఈ సీటు కోసం తీవ్రంగానే ప్ర‌య‌త్నించారు. కానీ ఆయ‌న్ని ఎంపీ అభ్య‌ర్థిగా కాంగ్రెస్ ప‌రిగ‌ణించ‌లేక‌పోయింది. చివ‌ర‌కు ఈ టికెట్ వెలిచాల‌ రాజేంద‌ర్‌రావుకు ద‌క్కింది. దీంతో నిరాశ‌లో మునిగిపోయిన తీన్మార్ మ‌ల్ల‌న్న‌కు కాంగ్రెస్ గుడ్‌న్యూస్ చెప్పింది. న‌ల్గొండ‌-వ‌రంగ‌ల్‌-ఖ‌మ్మం ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక‌ల్లో త‌మ అభ్య‌ర్థిగా తీన్మార్ మ‌ల్ల‌న్న‌ను బ‌రిలో దింపుతున్న‌ట్లు ప్ర‌క‌టించింది.

న‌ల్గొండ‌-వ‌రంగ‌ల్‌-ఖ‌మ్మం ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీగా ఉన్న ప‌ల్లా రాజేశ్వ‌ర్‌రెడ్డి గ‌త తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్ త‌ర‌పున ఎమ్మెల్యేగా గెలిచారు. దీంతో ఎమ్మెల్సీ ప‌ద‌వికి రాజీనామా చేశారు. ఈ నేప‌థ్యంలో ఉప ఎన్నిక అనివార్య‌మైంది. ఈ ఎమ్మెల్సీ ఎన్నిక కోసం మొత్తం 4.61 ల‌క్ష‌ల మంది ప‌ట్ట‌భ‌ద్రులు ఓట‌ర్లుగా న‌మోదు చేసుకున్నారు. నిజానికి 2021లో ఈ ఎమ్మెల్సీ స్థానానికి జ‌రిగిన ఎన్నిక‌ల్లో మ‌ల్ల‌న్న ఇండిపెండెంట్ అభ్య‌ర్థిగా పోటీ చేశారు. ఈ ఎన్నిక‌ల్లో కోదండ‌రాంను దాటేసి మ‌ల్ల‌న్న రెండో స్థానంలో నిల‌వ‌డంతో ఒక్క‌సారిగా ఆయ‌న హాట్ టాపిక్‌గా మారారు. మ‌రి ఈ సారి కాంగ్రెస్ నుంచి బ‌రిలో దిగుతున్న మ‌ల్ల‌న్న విజ‌యం ఖాయ‌మ‌నే అభిప్రాయాలున్నాయి. ఈ ఉప ఎన్నిక‌లో గెలిస్తే మ‌రో మూడేళ్ల పాటు ఆయ‌న ఎమ్మెల్సీ ప‌ద‌విలో ఉండే అవ‌కాశ‌ముంది.