లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో ఓ ఇంట్రస్టింగ్ పాయింట్ హాట్ టాపిక్‌గా మారింది. 20 ఏళ్లలో తొలిసారిగా కేసీఆర్ కుటుంబం నుంచి లోక్‌సభ ఎన్నికల్లో ఎవరూ పోటీ చేయడం లేదు. అంతేకాదు పార్లమెంట్‌లో అంటే లోక్‌సభ, రాజ్యసభ కలిపి కూడా కేసీఆర్ కుటుంబం నుంచి ఒక్కరూ ప్రాతినిథ్యం వహించడం లేదు. దీంతో ఈ టాపిక్ చర్చనీయాంశంగా మారింది. టీఆర్ఎస్ పార్టీ అవతరించిన తర్వాత ఇలా జరగడం ఇదే మొదటిసారి.
2004లో కరీంనగర్ నుంచి ఎంపీగా కేసీఆర్ గెలిచారు. దేశం దృష్టి తెలంగాణపై పడటం కోసం ఎంపీ పదవికి రాజీనామా చేసిన కేసీఆర్ 2006లో ఉప ఎన్నికలకు వెళ్లారు. అప్పుడు మరోసారి విజయం సాధించారు. 2008లోనూ ఉప ఎన్నిక బరిలో దిగి విజయదుందుభి మోగించారు. 2009లో మహబూబ్‌నగర్ నుంచి కేసీఆర్ మరోసారి గెలిచారు. తెలంగాణ ఏర్పడ్డాక 2014 సార్వత్రిక ఎన్నికల్లో మెదక్ నుంచి కేసీఆర్ విజయం సాధించారు. గజ్వేల్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన ముఖ్యమంత్రి కావడంతో ఎంపీ స్థానానికి రాజీనామా చేశారు. అదే లోక్‌సభ ఎన్నికల్లో కేసీఆర్ తనయ కవిత నిజామాబాద్ ఎంపీగా జయకేతనం ఎగురవేశారు.
కానీ 2019 లోక్‌సభ ఎన్నికల్లో నిజామాబాద్‌లో కవిత ఓటమి పాలయ్యారు. అయినా కేసీఆర్ అల్లుడు జోగినపల్లి సంతోష్‌రావు 2018లో రాజ్యసభ సభ్యుడిగా పదవి చేపట్టడంతో పార్లమెంట్‌లో ఆ కుటుంబం ప్రాతినిథ్యం కొనసాగింది. కానీ ఇటీవలే ఆయన పదవీకాలం పూర్తయింది. దీంతో కేసీఆర్ కుటుంబం నుంచి పార్లమెంట్‌లో ఒక్కరూ లేకుండా పోయారు. ఈ సారి లోక్‌సభ ఎన్నికల్లోనూ ఆయన కుటుంబం నుంచి ఎవరూ పోటీలో నిలబడకపోవడంతో పార్లమెంట్‌లో ఇప్పట్లో వీళ్ల ప్రాతినిథ్యం ఉండే అవకాశం లేదనే చెప్పాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates