లాజిక్ లేకుండా మాట్లాడితే ఎలా ఎమ్మెల్యే గారూ!

లాజిక్ లేకుండా మాట్లాడితే ఎలా ఎమ్మెల్యే గారూ!

ఏదో కొంటర్ ఇవ్వాలి గనుక కౌంటర్ ఒకటి పడేస్తే ఇలాగే ఉంటుంది. తలాతోకా లేని వ్యాఖ్యానాలే.. తర్కానికి నిలబడని విషయాలే అందులో ఉంటాయి. ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్న తీరు అలాగే కనిపిస్తోంది. ఏదో మాటకు మాట రిటార్టు ఇచ్చినట్టుగా కనిపించడానికి వారు గుర్తుకు వచ్చిన పదాలతో మంత్రి యనమల రామకృష్ణుడు మీద విరుచుకుపడుతున్నారు గానీ.. తాము చెబుతున్న వాదనలో ఏమాత్రం లాజిక్ లేదని కనీసం వారైనా గ్రహిస్తున్నారో లేదో అర్థం కావడం లేదు.

విషయం ఏంటంటే.. ఏపీలో ఉద్యోగుల పదవీ విరమణను 30 ఏళ్ల గరిష్ట సర్వీసుకు కుదించాలని ప్రభుత్వం జీవో తెచ్చినట్లుగా సాక్షి ఓ కథనాన్ని ప్రచురించింది. అంటే ఏపీలో చెప్పుకోడానికి 60 ఏళ్లకు పదవీ విరమణ ఉంటుంది గానీ.. ఈ కొత్త నిబంధన వల్ల.. 21 ఏళ్లకు ఉద్యోగం వచ్చిన వారెవరైనా ఉంటే.. వాళ్లు 51 ఏళ్లకే రిటైర్ కావాల్సి వస్తుందన్నమాట. తద్వారా ఉద్యోగుల భారాన్ని ప్రభుత్వం తగ్గించుకోదలచుకుంటున్నదని... ఉన్న ఖాళీలను భర్తీ చేయకపోగా..ఇదొక భారం ఉద్యోగులపై పడబోతున్నదని రకరకాలుగా ఆ కథనంలో పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగ వర్గాల్లో సహజంగానే ఇది సంచలనం అయింది.

అయితే ఈ కథనాన్ని మంత్రి యనమల రామకృష్ణుడు ఖండిస్తూ.. ఇది పచ్చి అబద్ధపు కథనం అని.. ఇలాంటి అసత్యాలను ప్రచారం చేస్తున్నందుకు సాక్షి దినపత్రిక మీద ప్రెస్ కౌన్సిల్ కు ఫిర్యాదు చేస్తాం అని పేర్కొన్నారు. అయితే ఇక్కడ ట్విస్టు ఏంటంటే.. యనమల వ్యాఖ్యలకు వైకాపా నాయకులు కౌంటర్ ఇవ్వదలచుకున్నారు. ఆ పార్టీ ఎమ్మెల్యే విశ్వేశ్వర రెడ్డి యనమలను తీవ్రంగా తిట్టిపోస్తూ ఆ వ్యాఖ్యలను ఖండించారు... ఓకే! కాకపోతే.. మంత్రి యనమల మీద తాము కూడా ప్రెస్ కౌన్సిల్  కు ఫిర్యాదు చేస్తాం అంటూ వెల్లడించారు.

అయినా.. ఇక్కడ విషయం ఏంటంటే.. దేశంలో ఉన్న పత్రికలమీద అప్రకటిత నియంత్రణాధికారాన్ని ప్రెస్ కౌన్సిల్ కలిగి ఉంటుంది గనుక.. సాక్షి మీద వారికి చెబుతానంటూ యనమల అన్న వ్యాఖ్యల వరకు ఓకె. మరి.. యనమల మీద ఏ రకంగా ప్రెస్ కౌన్సిల్ కు ఫిర్యాదు చేస్తారో అర్థం కాని సంగతి. రాష్ట్ర ప్రభుత్వంలోని మంత్రుల మీద ప్రెస్ కౌన్సిల్ కు ఏం అధికారం ఉంటుంది? ఈ లాజిక్ కూడా తెలియకుండా వైకాపా ఎమ్మెల్యే ఇన్ని దుడుకు ప్రకటనలు ఎలా చేసేశారు.. అని జనం విస్తుపోతున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు