ఏపీ సీఎం జగన్‌పై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఓ రేంజ్‌లో విమర్శలు గుప్పించారు. జగన్ పదోతరగతి పరీక్షలప్పుడు ప్రశ్న పత్రాలను హైదరాబాద్‌లోని శివశివానీ పాఠశాల నుంచి కొట్టేసి పరీక్షలు రాశాడని సంచలన ఆరోపణలు చేశారు. శనివారం జగన్‌పై జరిగిన దాడి చిన్నదేనని అయితే.. వైసీపీ నాయకులు దీనిని పెద్దదిగా ప్రచారం చేస్తున్నారని అన్నారు. జగన్ తన నాటకాలు కట్టిపెట్టాలని పవన్ సూచించారు.
జగన్‌కు చిన్న గాయమైతే రాష్ట్రమంతా ఊగిపోతోంది. సగటు మనిషికి గాయమైతే మనకు బాధ లేదా? జగన్‌కు గాయమైతే నాకు బాధగా ఉంది. ఇది నిజమో అబద్ధమో ఎవరికి తెలుసు? నాన్న పులి కథ ఒకసారి చెబితే బాగుంటుంది. ఎన్నికలు వచ్చినప్పుడల్లా చెబితే ఎవరు నమ్ముతారు? ఈ నాటకాలు ఆపండి చాలు. భరించలేకపోతున్నాం. ప్రజలు కూడా ఇలాంటి డ్రామాలను నమ్మకండి అని పవన్ వ్యాఖ్యానించారు. తెనాలిలో నిర్వహించిన వారాహి విజయభేరి సభలో పవన్ ప్రసంగిం చారు. అభివృద్ధి అంటే ఏంటో తాము కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత రాష్ట్ర ప్రజలకు రుచి చూపిస్తామన్నారు.
ఎన్నికల తర్వాత.. ఈజిప్టులో ముబారక్‌పై జరిగిన తిరుగుబాటు, శ్రీలంకలో జరిగిన తిరుగు బాటు వంటివి తాడేపల్లిలోనూ వస్తాయని పవన్ వ్యాఖ్యానించారు. ప్రజలు తాడేపల్లి ప్యాలెస్‌పై దండెత్తేందుకు ఎక్కువ రోజులు లేవని చెప్పారు. ఉపాధ్యాయు లను మందు కొట్ల దగ్గర కాపలా పెట్టిన ఘనుడు.. వారితో పింఛన్లు పంపిణీ చేస్తే తప్పా? ఎండకు మలమలా మాడిపోయేలా చేసి వృద్ధులను చంపేసి.. ఆ నెపంపై మాపై వేశారని పవన్ నిప్పులు చెరిగారు. తెనాలిలో నాదెండ్ల మనోహర్‌ను, గుంటూరులో చంద్రశేఖర్‌ను గెలిపించాలని సూచించారు.
నాకు జ్ఞానం అలా వచ్చింది..?
నాకు ఇంత జ్ఞానం ఎలా వచ్చిందని మా జనసైనికులు అప్పుడప్పుడు ప్రశ్నిస్తుంటారు. చిన్నప్పుడు నాకు ఓ వైశ్య సామాజిక వర్గానికి చెందిన మిత్రుడు ఉండేవాడు. వాడు నాకు పుస్తకాలు కొనిచ్చాడు. వాటిని చదివి నా జ్ఞానాన్ని పెంచుకున్నా. అందుకే నాకు వైశ్య సామాజిక వర్గం పట్ల అభిమానం. వారిసమస్యలు కూడా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. పరిష్కరిస్తాం అని పవన్ వ్యాఖ్యానించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates