అసెంబ్లీ సీట్ల పెంపు... అడుగు దూరంలోనేన‌ట‌!

అసెంబ్లీ సీట్ల పెంపు... అడుగు దూరంలోనేన‌ట‌!

తెలుగు రాష్ట్రాల అసెంబ్లీల్లో సీట్ల పెంపున‌కు సంబంధించిన క‌స‌ర‌త్తుపై ఇప్పుడు లెక్క‌లేన‌న్ని క‌థ‌నాలు వ‌చ్చేస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోని అధికార పార్టీల‌కు అనుకూలంగా ఉంటున్న మీడియా... త్వ‌ర‌లోనే సీట్లు పెర‌గ‌నున్నాయని వార్త‌లు రాస్తుంటే, విప‌క్షాల‌కు చెందిన మీడియా మాత్రం సీట్ల పెంపు దాదాపుగా సాధ్యం కాద‌న్న కోణంలో వార్త‌లు రాసేస్తున్నాయి. దీంతో అస‌లు వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి అస‌లు సీట్ల సంఖ్య పెరుగుతుందా?  లేదా? అన్న అయోమ‌యంలో రెండు రాష్ట్రాల ప్ర‌జ‌ల‌తో పాటు అటు అవ‌కాశం కోసం కాసుక్కూర్చున్న పొలిటీషియ‌న్లు కూరుకుపోయారు.

రెండు రాష్ట్రాల్లో అధికార పార్టీలుగా ఉన్న టీడీపీ, టీఆర్ఎస్‌లు కొంత‌కాలం క్రితం దాకా చేప‌ట్టిన ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్‌కు విప‌క్షాల‌కు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల‌తో పాటు పెద్ద సంఖ్య‌లోనే మాజీలు, తాజా మాజీలు వ‌చ్చేశారు. వీరంద‌రికీ వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎక్క‌డో ఒక చోట అవ‌కాశం ఇస్తామ‌ని, అసెంబ్లీ సీట్ల సంఖ్య పెరుగుతున్న నేప‌థ్యంలో ఎలాంటి ఇబ్బంది లేద‌ని కూడా అధికార పార్టీ వ‌ర్గాలు హామీలు గుప్పించేశాయి.

అయితే సీట్ల సంఖ్య పెంపున‌కు సంబంధించి కేంద్రంలోని న‌రేంద్ర మోదీ స‌ర్కారు వ్య‌వ‌హ‌రిస్తున్న నాన్చుడు ధోర‌ణితో వ‌ల‌స ప‌క్షుల్లో ఆందోళ‌న నానాటికీ పెరిగిపోతోంది. ఈ క్ర‌మంలో నేటి సంచిక‌లో తెలుగు నేల‌కు చెందిన ఓ ప్ర‌ధాన ప‌త్రిక‌... రెండు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపు కేవ‌లం అడుగు దూరంలోనే ఉంద‌ని ఓ ఆస‌క్తిక‌ర క‌థనాన్ని రాసేసింది. ఆ ప‌త్రిక క‌థ‌నం ప్ర‌కారం... ఏపీ పున‌ర్విభ‌జ‌న చ‌ట్టం ప్ర‌కారంగా విడిపోయిన రెండు తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల సంఖ్య‌ను పెంచేందుకు పెద్ద‌గా శ్ర‌మించాల్సిన అవ‌స‌ర‌మేమీ లేద‌ని కేంద్ర న్యాయ శాఖ తేల్చేసిందట‌. రాజ్యాంగంలోని ఆర్టిక‌ల్ 170(3)కి ఓ చిన్న స‌వ‌ర‌ణ చేసేస్తే స‌రిపోతుంద‌ట‌.

ఈ మేర‌కు తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపున‌కు సంబంధించి కేంద్ర హోం శాఖ పంపిన ఫైల్‌ను న్యాయ శాఖ ఇప్ప‌టికే క్లియ‌ర్ చేసి తిప్పి పంపింది. రాజ్యాంగానికి చిన్న స‌వ‌ర‌ణ చేస్తే స‌రిపోతుంద‌ని చెప్ప‌డంతో పాటు... అందుకు త‌న సానుకూల‌త‌ను కూడా న్యాయ శాఖ ఇచ్చేసింద‌ని స‌ద‌రు క‌థ‌నం వెల్ల‌డించింది. ఈ క‌థ‌నంలో ఉన్న విష‌యం నిజంగానే వాస్త‌వ‌మైతే... రెండు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపు నిజంగానే అడుగు దూరంలో ఉన్న‌ట్లే లెక్క‌. అయితే ఇది కూడా ఎప్ప‌టిక‌ప్పుడు అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంపుపై కేంద్ర హోం శాఖ క‌దిలిన‌ప్పుడల్లా వ‌స్తున్న క‌థ‌నాల్లాంటిదే అయితే మాత్రం రెండు రాష్ట్రాల అధికార పార్టీల‌కు మ‌రింత టెన్ష‌న్ త‌ప్ప‌దన్న వాద‌న వినిపిస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు