యువరాజుపై దండయాత్ర

యువరాజుపై దండయాత్ర

గోవాలో అత్యధిక సీట్లు సాధించిన పార్టీగా నిలిచినా అధికారం చేపట్టలేకపోవడంతో అక్కడి వ్యవహారాలు చూసిన కాంగ్రెస్ సీనియర్ లీడర్ దిగ్విజయ్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన ఆ విమర్శలను రాహుల్ గాంధీ వైపు డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా ఆయన రాహుల్ గాంధీ పనితీరుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాహుల్ సీరియస్ గా పనిచేయాల్సిన టైమొచ్చిందని... అలా పనిచేయలేకపోతే వేస్టేనన్నారు.

తమ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అంకిత భావంతో, దృఢ నిశ్చయంతో పనిచేయాల్సిన సమయం ఆసన్నమైందని దిగ్విజయ్ వ్యాఖ్యానించారు. ఆయన సరిగా పనిచేయడం లేదని... ఇదే విషయాన్ని రాహుల్ కు తాను పలుసార్లు చెప్పానని... ఇప్పుడు కూడా అదే చెబుతున్నానని అన్నారు. ఆధునిక మార్పులకు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీని తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని చెప్పారు. ప్రస్తుతం తమకు కొత్త కాంగ్రెస్, కొత్త ప్రణాళిక, కొత్త మార్గ సూచిక, వినూత్నమైన ప్రచార శైలి కావాలని అన్నారు. మధ్య తరగతి ప్రజల ఆంకాంక్షలకు అనుగుణంగా ప్రణాళికలను రచించుకోవాలని చెప్పారు. ఆ పనిని పార్టీ అధిష్ఠానమే చేయాలని, రాహుల్ గాంధీనే చేయాలని స్పష్టం చేశారు.

కాగా మరో సీనియర్ లీడర్.. మాజీ కేంద్ర మంత్రి, ప్రస్తుతం అంతగా యాక్టివ్ గా లేని కిశోర్ చంద్రదేవ్ కూడా నిన్న రాహుల్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన చుట్టూ 12 మంది కోటరీ ఉందని.. వారు చెప్పినట్టల్లా రాహుల్ ఆడుతున్నారని.. ఆ కోటరీని నియంత్రిస్తే కానీ రాహుల్ నేతగా నిరూపించుకోలేరని అన్నారు.

ఇలా.. కాంగ్రెస్ సీనియర్లంతా ఒక్కరొక్కరు రాహుల్ చేతకానితనాన్ని ఓపెన్ గా చెప్పేస్తున్నారు. రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ కూడా దేశంలో లేని సమయంలో సీనియర్ నేతలంతా ఇలా నిరసన గళం వినిపిస్తుండడంతో కాంగ్రెస్ లో ఎప్పుడు ఏం జరుగుతుందా అన్న పరిస్థితి కనిపిస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు