వాళ్ల‌ను భూమ్మీద లేకుండా చేయాలంటున్న ట్రంప్‌

వాళ్ల‌ను భూమ్మీద లేకుండా చేయాలంటున్న ట్రంప్‌

ఓ వ‌ర్గానికి చెందిన వారు చేప‌డుతున్న జిహాద్ దాడుల‌కు అమెరికా కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్త భాష్యం చెప్పారు. జ‌ర్మ‌నీలో జ‌రిగిన ఉగ్ర‌దాడి, ట‌ర్కీలో ర‌ష్యా రాయ‌బారి హ‌త్యను ప్ర‌స్తావిస్తూ.. క్రిస్టియ‌న్ల‌కు వ్య‌తిరేకంగా జ‌రుగుతున్న గ్లోబ‌ల్ జిహాద్‌లో భాగ‌మే ఈ రెండు దాడులు అని ట్రంప్ స్ప‌ష్టంచేశారు. గ్లోబ‌ల్ జిహాద్‌లో భాగంగా ఇస్లామిక్ ఉగ్ర‌వాదులు ఎంతోమంది క్రిస్టియ‌న్లను చంపార‌ని, వాళ్ల ప్రార్థ‌నాల‌యాలను ధ్వంసం చేశార‌ని ట్రంప్ ఒక ప్ర‌క‌ట‌న‌లో విమ‌ర్శించారు.

క్రిస్మ‌స్ హాలిడే ఎంజాయ్ చేస్తున్న అమాయ‌క ప్ర‌జ‌ల‌ను చంపారు. ఇలాంటి ఉగ్ర‌వాదుల‌ను భూమి మీద లేకుండా చేయాలి. శాంతిని ప్రేమించే అంద‌రినీ కలుపుకొని వెళ్తూ.. ఆ ప‌ని చేస్తామ‌ని ట్రంప్ హెచ్చ‌రించారు. "ఓ రాడిక‌ల్ ఇస్లామిక్ ఉగ్ర‌వాది చేతిలో హ‌త్య‌కు గురైన ర‌ష్యా రాయ‌బారి ఆండ్రీ కార్లోవ్ కుటుంబానికి నా ప్ర‌గాఢ సానుభూతి తెలుపుతున్నాను. ఓ రాయ‌బారిని హ‌త్య చేయ‌డం అంత‌ర్జాతీయ నిబంధ‌న‌ల‌ను ఉల్లంఘించ‌డమే. దీనిని అంత‌ర్జాతీయంగా ముక్తకంఠంతో ఖండించాలి" అని ట్రంప్ మ‌రో ప్ర‌క‌ట‌న‌లో అన్నారు. "ఈ రోజు ట‌ర్కీ, స్విట్జ‌ర్లాండ్, జ‌ర్మ‌నీల్లో ఉగ్ర‌దాడులు జ‌రిగాయి. ప‌రిస్థితి రోజురోజుకూ దిగ‌జారుతోంది. నాగ‌రిక ప్ర‌పంచం క‌చ్చితంగా త‌మ ఆలోచ‌న విధానాన్ని మార్చుకోవాలి" అని ట్రంప్ ట్వీట్ చేశారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు