ఆయనే వచ్చేలా ఉన్నాడు..!

ఆయనే వచ్చేలా ఉన్నాడు..!

ప్రపంచం ఏం జరగకూడదని కోరుకుంటుందో అదే జరిగేలా ఉంది. ఎన్నారైల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. సర్వేల విశ్వసనీయతే ప్రశ్నార్థకంగా మారింది. అమెరికా చరిత్రలోనే అత్యంత వివాదాస్పద అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష పీఠం దిశగా దూసుకుపోతున్నారు. హిల్లరీకి మొదట్లో ఆధిక్యం వచ్చినా.. ఆతర్వాత ట్రంప్ దూకుడు చూపిస్తున్నారు.
 
కీలక రాష్ట్రాలైన ఫ్లోరిడా, ఓహియో, వర్జీనియాల్లో ట్రంపే ముందున్నారు. హిల్లరీ కనీసం ట్రంప్ కు సరైన పోటీ ఇవ్వలేకపోతున్న రాష్ట్రాలు పెరిగిపోతున్నాయి. అసలేం జరుగుతుందో ఎవరికీ అంతు చిక్కడం లేదు. అమెరికన్ ఓటర్ నాడేంటో కనుక్కోవడంలో సర్వేలతో పాటు ప్రపంచ మీడియా సంస్థలన్నీ విఫలమయ్యాయి.

ఇప్పటివరకూ అమెరికాలో 27 రాష్ట్రాల్లో కౌంటింగ్ పూర్తైంది. ట్రంప్ కు 167 ఎలక్టోరల్ ఓట్లు రాగా, హిల్లరీకి 107 వచ్చాయి. ట్రంప్ 17 రాష్ట్రాల్లో లీడ్ లో ఉండగా.. హిల్లరీ పది రాష్ట్రాలకే పరిమితమయ్యారు. రాజకీయాలకు అపరిచితుడైన ట్రంప్.. రాజకీయాల్లో మేరు నగ ధీరురాలు హిల్లరీని ఓటమి పాలు చేసే దిశగా వడివడిగా దూసుకొస్తున్నారు.

విద్వేషకర, వివాదాస్పద, సంచలన వ్యాఖ్యలు చేయడంతో పాటు లైంగిక ఆరోపణలు ఎదుర్కొన్న ట్రంప్ ఓటమి ఖాయమని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. హిల్లరీ 90 శాతం గెలిచే అవకాశముందని ఓటింగ్ ముందురోజు తుది సర్వే వెల్లడించింది. హిల్లరీయే గెలుస్తుందని మీడియా కూడా అంచనా వేసింది. అయితే అందరి అంచనాలను తారుమారు చేస్తూ ట్రంప్ దూసుకెళ్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు