సుప్రీంకోర్టులో తేల్చుకుంటాడట

సుప్రీంకోర్టులో తేల్చుకుంటాడట

ఓటుకు నోటు కేసులో ఏపీ ముఖ్యమంత్రిని ఏ1గా ఛార్జ్‌ షీట్‌ దాఖలు చేయాలంటూ ఏపీ విపక్ష ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి చేసిన ప్రయత్నానికి హైకోర్టు తాజాగా తన ఆదేశాలతో బ్రేకులు వేసిన సంగతి తెలిసిందే. ఇటీవలే ఏసీబీ ప్రత్యేక కోర్టులో ప్రైవేటు ఫిర్యాదు చేయటంతో ఈ వ్యవహారం తెర మీదకు వచ్చింది. ఆళ్ల చేసిన ఫిర్యాదుపై స్పందించిన ఏసీబీ కోర్టు పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయాలని ఆదేశాలు జారీ చేయటం.. ఈ నిర్ణయంపై తాజాగా హైకోర్టు స్టే ఇవ్వటం తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలో ఆళ్ల రియాక్ట్‌ అయ్యారు.

'ఓటుకు నోటు కేసు'తో ఏపీ ముఖ్యమంత్రిని ఇరుకున పెట్టే ప్రయత్నంపై హైకోర్టు ఆదేశం ఇప్పుడు ఏపీ విపక్షానికి ఇబ్బందికరంగా మారిందని చెప్పాలి. ఓటుకు నోటు వ్యవహారంపై ఏసీబీ కోర్టు ఇచ్చిన ఆదేశాలపై ఏపీ విపక్షం ఎంత హడావుడి చేసిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ కేసు నిలబడదన్న మాటను పలువురు న్యాయ నిపుణులు చెబుతున్నా.. అందుకు భిన్నంగా జగన్‌ మీడియాలో భారీ కథనాలు పతాక శీర్షికల్లో అచ్చు కావటంపై పలువురు విస్మయాన్ని వ్యక్తం చేశారు.

తాజాగా హైకోర్టు ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో బాబుపై ఫిర్యాదు చేసిన ఆళ్ల.. ఈ వ్యవహారాన్ని సుప్రీంకోర్టులో తేల్చుకోవాలన్న ఆలోచనను బయటపెట్టారు. ఓటుకు నోటు అంశంపై ఏసీబీ ఆదేశాలపై హైకోర్టు స్టే ఇచ్చిన నేపథ్యంలో ఆయన మాట్లాడారు. ఈ వ్యవహారంలో బయటకు వచ్చిన ఆడియో టేపులో ఉన్న గొంతు చంద్రబాబునాయుడిదేనని.. ఆ విషయాన్ని నిరూపించే ఫోరెన్సిక్‌ నివేదికల్ని సుప్రీంకోర్టులో అందజేయనున్నట్లు వెల్లడించారు. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఈ వ్యవహారాన్ని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళతానని.. బాబుపై తాను పోరాడతానని ఆళ్ల పేర్కొనటం గమనారం. హైకోర్టు ఆదేశాలతో ఓటుకు నోటు ఉదంతంలో బాబుకు ఊరటగా భావిస్తున్నప్పటికీ.. సుప్రీం నిర్ణయం తర్వాత తమ్ముళ్లు అలా ఫీలైతే మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు