ఈ ఏడాది ఎండలు జనాలను హడలెత్తిస్తున్నాయి. ఏకంగా 44, 45 డిగ్రీల ఊష్ణోగ్రతలు నమోదు అవుతుండడంతో వాతావరణ శాఖ తీవ్ర హెచ్చరికలు జారీచేస్తున్నది. ఆంధ్రప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాలకు ఐఎండీ రెడ్ అలర్ట్‌ను జారీ చేసింది. రాబోయే రెండు, మూడు రోజులలో వడగాడ్పుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని, సాధ్యమైనంత వరకు ప్రజలు ఇంటి నుండి బయటకు రావద్దని, అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్లవద్దని సూచించింది.
ఇక అదే సమయంలో తెలంగాణ, కర్ణాటక, సిక్కిం రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఈ ఏడాది ఏప్రిల్ నెలలోనే గతంలో ఎన్నడూ లేనంతగా రికార్డ్ స్థాయి ఊష్ణోగ్రతలు నమోదయ్యాయి. 103 ఏండ్ల తర్వాత ఈ అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయినట్లు చెబుతున్నారు. వాతావరణ శాఖ చెబుతున్న సమాచారం ప్రకారం 1921 తర్వాత 2024కు ముందు ఏ ఏడాదిలోనూ 44 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు కాలేదు.
ఈ ఏడాది ఏప్రిల్ నెలలోనే రాష్ట్రంలోని పలుచోట్ల 44 డిగ్రీల ఊష్ణోగ్రత దాటడం విశేషం. రానున్న ఐదు రోజులలో దేశవ్యాప్తంగా వాతావరణం మరింత వేడెక్కుతుందని, ఈ ఐదురోజులలో దేశంలోని తూర్పు, దక్షిణ భాగంలో తీవ్రమైన వేడి గాలులు వీస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. మే నెలలో కూడా గతంకన్నా అధిక ఉష్ణోగ్రతలు నమోదు కావచ్చని చెబుతున్నది.