తెలంగాణలో ఎన్నికల బరిలో లేకున్నా తెలుగుదేశం పార్టీకి అక్కడ గిరాకీ తగ్గడం లేదు. గత శాసనసభ ఎన్నికల్లో తమకు మద్దతు ఇవ్వాలని నేరుగా కాంగ్రెస్ అభ్యర్థులు అక్కడి టీడీపీ కార్యాలయానికి వెళ్లారు. ఆ తర్వాత ఎన్నికల్లో గెలిచాక వెళ్లి ధన్యవాదాలు తెలిపారు. ఇప్పుడు లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో మళ్లీ ఆ పార్టీ కార్యాలయానికి అందరూ క్యూ కట్టారు. ఖమ్మం జిల్లా టీడీపీ కార్యాలయం చుట్టూ ఖమ్మం లోక్ సభ అభ్యర్థులు క్యూ కట్టారు. దీంతో వారు ఎవరికి మద్దతు పలుకుతారోనని అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.
గత శాసనసభ ఎన్నికల్లో టీడీపీ శ్రేణులు ఖమ్మంలో కాంగ్రెస్ వెంట నడిచాయి. చంద్రబాబు, రేవంత్ ఫ్యాక్టరీ దీనికి దోహదం చేసింది. దీంతో గెలిచిన తర్వాత మంత్రులు పొంగులేటి, తుమ్మలను టీడీపీ ఆఫీసుకు వెళ్లి ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుతం కాంగ్రెస్ నుండి రామసహాయం రఘురామిరెడ్డి, బీఆర్ఎస్ నుండి నామా నాగేశ్వర్ రావు, బీజేపీ నుండి వినోద్ రావులు పోటీకి దిగారు. వీరంతా ఇప్పుడు టీడీపీ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు.
గత ఎన్నికల మాదిరిగానే మళ్లీ తమకు మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ నేతలు టీడీపీని కోరారు. అయితే కాంగ్రెస్ నుండి కమ్మ సామాజిక వర్గానికి టికెట్ ఇస్తారనుకుంటే మొండి చేయి చూపారని వారు గుర్రుగా ఉన్నారు. ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నేపథ్యంలో ఇక్కడ తనకు మద్దతు ఇవ్వాలని బీజేపీ అభ్యర్థి వినోద్ రావు తిరుగుతున్నాడు.
రేపో, మాపో చంద్రబాబునాయుడు తెలంగాణలో టీడీపీ మద్దతు బీజేపీకే అని ప్రకటన చేయనున్నారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ఇక బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వర్ రావు కూడా టీడీపీ మద్దతు ఆశిస్తూ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నాడు. కమ్మ సామాజిక వర్గం అక్కడ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో తనకు మద్దతు ఇవ్వాలని కోరుతున్నాడు. అక్కడ మంత్రులు పొంగులేటి, తుమ్మలల మధ్య విభేదాలు కూడా బీఆర్ఎస్ అభ్యర్థికి కలిసి వస్తున్నట్లు చెబుతున్నారు. ఆఖరుకు టీడీపీ శ్రేణులు ఎటు వైపు మొగ్గు చూపుతాయో వేచిచూడాలి.