బాబు ఏం కట్టాలో కూడా కేటీఆరే చెప్పేస్తారా?

బాబు ఏం కట్టాలో కూడా కేటీఆరే చెప్పేస్తారా?

తెలంగాణరాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌  కుమారుడు.. మంత్రి కేటీఆర్‌ ఆసక్తికర ట్వీట్‌ ఒకటి చేశారు. ప్రస్తుతం నడుస్తోన్న హైకోర్టు విభజన అంశం నేపథ్యంలో.. అమరావతిలో సచివాలయాన్ని ఏర్పాటు చేసుకున్నందుకు అభినందనలు అని చెప్పిన ఆయన.. హైకోర్టు అమరావతిలో ఉండాలనే అంశానికి అంత ప్రాధాన్యత లేదా? అంటూ తన ట్వీట్‌ తో ప్రశ్నించారు.

కేటీఆర్‌ తీరు చూస్తే.. ఏపీ రాజధాని అమరావతిలో ఏం ఉండాలి? ఏం నిర్మించాలి? అన్న విషయాల్ని కూడా ఆయన చెప్పేటట్లే ఉన్నారన్న అభిప్రాయం వ్యక్తం కావటం ఖాయం. నిజానికి అమరావతిలోని వెలగపూడిలో నిర్మించిన సచివాలయం తాత్కాలికమేనన్న విషయాన్ని మర్చిపోకూడదు. ఇప్పుడీ భవనాన్ని సచివాలయానికి కేటాయించినా.. రేపొద్దున మరో అవసరాలకు వాడే వీలుంది. ఏపీ ముఖ్యమంత్రి హైదరాబాద్‌ వదిలిపెట్టి అమరావతి వెళ్లి ఏడాది పైనే అయిన నేపథ్యంలో.. ఉద్యోగులు ఒకచోట.. ఆయనో చోట ఉండటం సరికాదు. ఈ కారణంతో పరిపాలనా విభాగం మొత్తం అమరావతి వెళ్లిందన్న విషయాన్ని మర్చిపోకూడదు.

కానీ.. హైకోర్టు విషయంలో అలా కాదు. ఏదో ఒక బిల్డింగ్‌ ఏర్పాటు చేసి జడ్జిలను కూర్చోపెట్టే కన్నా.. శాశ్విత కట్టడంలో హైకోర్టును ఏర్పాటు చేయటం సబబుగా ఉంటుంది. అయినా.. పదేళ్లు ఉమ్మడి రాజధానిగా కలిసి ఉండే అవకాశం విభజనచట్టం స్పష్టంగా ఇచ్చింది. తన అవసరాలు.. తన ప్రాధాన్యతలకు తగ్గట్లుగా ఏపీ సర్కారు నిర్మాణాల్ని ఏర్పాటు చేసుకునే వీలుంది. కానీ.. అందుకు భిన్నంగా హైకోర్టు కట్టుకోరా? ఇంకో కట్టటం కట్టరా? అంటూ ట్విట్టర్లో ట్వీట్లు చేయటం కేటీఆర్‌ కు సబబు కాదన్న అభిప్రాయాన్ని పలువురు సీమాంధ్రులు వ్యక్తం చేస్తున్నారు. తమ అవసరాలకు తగ్గట్లుగా ఆంధ్రోళ్లు ఉండాలని.. ఆంధ్రాపాలకులు వ్యవహరించాలన్నట్లుగా కేటీఆర్‌ వైఖరి ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. పక్క రాష్ట్రం వైపు మరీ అంతగా తొంగిచూడాలా..?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు