ఇందిర, సోనియా పేకాట సీను తెలుసా?

ఇందిర, సోనియా పేకాట సీను తెలుసా?

రోమ్ నగరం తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేల్ వాయించాడట... 1971లో ఇండోపాక్ యుద్ధం సమయంలోనూ అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ కూడా అంతే ఈజీగా వ్యవహరించారని తెలుస్తోంది. ఆమె వ్యక్తిగత వైద్యుడు డాక్టర్ కేపీ మాథుర్ తాజాగా విడుదల చేసిన పుస్తకంలో అంశాల ఆధారంగా చూసుకుంటే ఇందిరాగాంధీ 1971 యుద్దాన్ని పెద్దగా సీరియస్ గా తీసుకోలేదని తెలుస్తోంది. భారత్ - పాకిస్థాన్ దేశాల మధ్య 1971లో యుద్ధం చెలరేగే సమయానికి ఇందిరాగాంధీ ఇంట్లో దివాన్ మీద దుప్పటి మార్చుకుంటున్నారట.  సఫ్దర్‌జంగ్ ఆస్పత్రిలో వైద్యుడిగా పనిచేసిన మాథుర్ సుమారు 20 ఏళ్ల పాటు ఇందిరాగాంధీకి వ్యక్తిగత వైద్యుడిగా పనిచేశారు. అప్పటి అనుభవాలను, పరిణామాలను ఆయన తన తాజా పుస్తకంలో రాశారు. 'ద అన్‌సీన్ ఇందిరాగాంధీ' అనే ఈ పుస్తకంలో అంశాల ఆధారంగా ఇందిరాగాంధీకి సంబంధించిన అనేక అంశాలు వెల్లడయ్యాయి.   1971 డిసెంబర్ 3న పాకిస్థాన్ యుద్ధం ప్రారంభించే సమయానికి ఇందిర కోల్‌కతాలో ఉన్నారు. . వెంటనే ఆమె తిరిగి ఢిల్లీకి వచ్చేశారు. విమాన ప్రయాణంలో కూడా ఆమె పెద్దగా టెన్షన్ ఏమీ పడలేదని, యుద్ధవ్యూహాలు, భవిష్యత్తులో చేయాల్సిన కార్యక్రమాల గురించే ఆలోచించారని మాథుర్ తన పుస్తకంలో రాసుకొచ్చారు.

కానీ, అంతకుముందు ఆమె 1966లో ప్రధానమంత్రిగా తొలిసారి బాధ్యతలు చేపట్టినప్పుడు మాత్రం గందరగోళంగా ఉండేవారని మాథుర్ తన పుస్తకంలో రాశారు.  అప్పటికి ఆమెకు స్నేహితులుగానీ, సలహాదారులుగానీ ఎవరూ లేరని.. పాలన విషయాలకు సంబంధించి బాగా టెన్షన్ పడేవారని.. కన్ఫ్యూజ్ అయ్యేవారని రాశారు. ఆ టెన్షన్ కారణంగా ఆమెకు కడుపులో బాగుండేది కాదని, దానికి తాను చికిత్స చేసేవాడినని అన్నారు. ఆమె ఎప్పుడైనా పర్యటనకు వెళ్తే, కనాట్‌ప్లేస్‌లోని సౌతిండియన్ కాఫీ హౌస్‌ నుంచే టిఫిన్లు తెప్పించుకునేవారట.  భోజనాల తరువాత ఇందిర, సోనియాలు పేకాట ఆడుకునేవారని మాథుర్ తన పుస్తకంలో రాశారు.

ఇక సోనియా విషయానికొస్తే ఆమెను ఇందిర బాగా చూసుకునేవారట. ఇతరులతో సోనియా గురించి చెప్పేటప్పుడు బహూరాణి అనేవారట.ఆమె త్వరగా భారతీయ సంస్కృతిని అలర్చుకోవాలని మాత్రం ఇందిర బలంగా కోరుకునేవారట. సోనియా - ఇందిర చాలా త్వరగా ఒకరికి ఒకరు అలవాటు పడిపోయారని, ఇంటిని నడిపించే బాధ్యతను సోనియా చాలా త్వరగా తీసుకున్నారని మాథుర్ తన పుస్తకంలో రాశారు. ఆదివారాలు ఆమె ఎక్కువగా పుస్తకాలు చదివేవారని, గొప్పవాళ్ల ఆత్మకథలను ఎక్కువ చదివారని అన్నారు. కొన్నిసార్లు భోజనం తర్వాత పేకాట ఆడేవారని, 1977 లోక్‌సభ ఎన్నికల్లో తన ఓటమిని కూడా ఆమె చాలా హుందాగా తీసుకున్నారని తెలిపారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు