ఆ నియోజకవర్గంలో ఎవరికైనా ఒక్కసారే ఛాన్స్. ఏ ఎమ్మెల్యే కూడా రెండోసారి గెలిచిన చరిత్ర లేదు. వరసగా మూడు ఎన్నికలలో అక్కడి ఓటర్లు మూడు పార్టీల నుండి ముగ్గురు ఎమ్మెల్యేలను ఎన్నుకున్నారు. ఈ సారి ఎన్నికలలో అక్కడ ఏ పార్టీ జెండా ఎగురుతుందా ? అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అదే విశాఖపట్నం నార్త్ శాసనసభ నియోజకవర్గం.
నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2009లో ఈ నియోజకవర్గం ఏర్పాటయింది. ఆ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థి విజయ్ కుమార్ ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థి శిరిన్ రహమన్ షేక్ మీద 5,523 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించాడు. 2014లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత టీడీపీ, బీజేపీ పొత్తులో భాగంగా ఈ నియోజకవర్గం బీజేపీకి కేటాయించారు. ఆ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థి పెన్మత్స విష్ణుకుమార్ రాజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చొక్కాకుల వెంకట్రావు మీద 18,240 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించాడు. 2019 ఎన్నికలలో టీడీపీ అభ్యర్థి గంటా శ్రీనివాసరావు వైసీపీ అభ్యర్థి కమ్మీల కన్నపరాజు మీద 1944 ఓట్ల స్వల్ప ఆధిక్యంతో విజయం సాధించాడు.
ప్రస్తుతం ఈ స్థానం నుండి వైసీపీ అభ్యర్థిగా కేకే రాజు, టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తులో భాగంగా బీజేపీ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే పెన్మత్స విష్ణుకుమార్ రాజు పోటీ చేస్తుండగా ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటూ జైభారత్ నేషనల్ పార్టీ తరఫున సీబీఐ మాజీ జేడీ వివి లక్ష్మీనారాయణ పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓడిపోయిన వైసీపీ అభ్యర్థి వైపు సానుభూతి కనిపిస్తున్నది. అయితే జేడీ లక్ష్మీనారాయణ ఎన్నికలలో ఎక్కువ ప్రభావం చూపితే అది ఎవరికి చేటు చేస్తుంది ? అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి.
ముగ్గురు అభ్యర్థులు హోరాహోరీగా తలపడుతున్నా ప్రధాన పోటీ వైసీపీ, బీజేపీ మధ్యనే కనిపిస్తోంది. ఇక్కడ ఒకసారి గెలిచిన వారికి రెండో చాన్స్ లేదనే సెంటిమెంట్ కూడా వైసీపీ అభ్యర్థికి సానుకూలంగా మారుతోంది. గత ఎన్నికలలో టీడీపీ నుండి గెలిచిన గంటా ఆ తర్వాత నియోజకవర్గాన్ని పట్టించుకోకపోవడంతో పూర్తి స్థాయిలో ఇక్కడ వైసీపీ అభ్యర్థి అందుబాటులో ఉండడం కూడా కలిసివస్తుంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates