ముస్లింలను గెంటేయండి?

ముస్లింలను గెంటేయండి?

అమెరికా అధ్యక్ష ఎన్నికలు రసవత్తరంగా మారుతున్నాయి. ముస్లీంలపట్ల ఉన్న వ్యతిరేకతను రిపబ్లికన్‌ నేత డొనాల్డ్‌ ట్రంప్‌ మరోమారు చూపారు. దక్షిణ కరోలినాలోని విన్‌థ్రోప్‌ యూనివర్సిటీలో శుక్రవారం రాత్రి ర్యాలీ జరిగింది. ఈ సందర్భంగా డొనాల్డ్‌ ట్రంప్‌ వేదిక మీదకు వస్తారనగా...రోసే హమీద్‌ అనే మహిళతోపాటు మరికొంత మంది లేచి నిలబడ్డారు. 'ఐ కమ్‌ ఇన్‌ పీస్‌' అని రాసివున్న టీ షర్ట్స్‌, 'ముస్లిమ్స్‌' అనే బ్యాడ్జీలను వీరు ధరించారు. అమెరికా అధ్యక్ష పదవి కోసం డొనాల్డ్‌ ట్రంప్‌ చేస్తున్న జాతి విద్వేష వ్యాఖ్యలకు నిరసన తెలియజేయటమే వీరి ఉద్దేశం.

అయితే ఇది గమనించిన అక్కడి పోలీసు అధికారులు, ఇతరులు ఆమెను బలవంతంగా గెంటేశారు. అంతేగాక 'నీ దగ్గర బాంబు వుందా ?' 'గెటవుట్‌' అంటూ ఆమెను వెళ్లగొట్టారు. ఈ ఉదంతంపై 'ద కౌన్సిల్‌ ఆన్‌ అమెరికా- ఇస్లామిక్‌ రిలేషన్స్‌' (సీఏఐఆర్‌) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. డొనాల్డ్‌ ట్రంప్‌ క్షమాపణలు చెప్పాల్సిందిగా ఈ సంస్థ డిమాండ్‌ చేసింది. ముస్లీం వ్యతిరేక భావజాలాన్ని ప్రచారం చేయటం ద్వారా అధ్యక్ష రేసులో డొనాల్డ్‌ ట్రంప్‌ లబ్ధి పొందాలని చూస్తున్నారని, దీనిని అడ్డుకోవాల్సిన అవసరముందని, ఇందుకోసం అమెరికా లోని ముస్లీం నాయకులు సమాలోచనలు చేయాలని సీఏఐఆర్‌ ఎగ్జిక్యూ టివ్‌ డైరెక్టర్‌ నిహాద్‌ ఆవాద్‌ అన్నారు.

డొనాల్డ్‌ ట్రంప్‌ ర్యాలీ నుంచి గెంటివేయబడిన రోసే హమీద్‌ మాట్లాడుతూ...''ఆయన చేసిన జాతి విద్వేష వ్యాఖ్యలు ముస్లీంలను ఉద్దేశించి మాత్రమే కాదు, అందర్నీ ఉద్దేశించినవి. అందుకే ఆ మాటలకు నేను లేచి నిలబడి నిరసన వ్యక్తం చేశాను'' అని చెప్పారు. అయితే ఈ ఘటనపై ట్రంప్‌ తదుపరి ప్రచార ర్యాలీలో స్పందించకపోవడం ఆసక్తికరం.