టీఆర్ఎస్ దూకుడు.. కాంగ్రెస్ వెనుకంజ‌..!

అంతా అనుకున్న‌ట్లే అయింది. అంది వ‌చ్చిన అవ‌కాశాన్ని గులాబీ పార్టీ చ‌క్క‌గా అందిపుచ్చుకుంది. ఒక దిశ ద‌శ లేని కాంగ్రెస్ మాత్రం ఈ విష‌యంలో వెన‌క‌ప‌డింది. తెలంగాణ ఏర్పాటుపై ప్ర‌ధాని మోదీ పార్ల‌మెంటు లో మాట్లాడిన మాట‌ల‌పై తెలంగాణ స‌మాజం భ‌గ్గుమంది. తెలంగాణ అంటే టీఆర్‌స్సే అని చెప్పుకుంటున్న గులాబీ పార్టీ ఒక్క‌సారిగా ఫైర్ అయింది. తెలంగాణ వ్యాప్తంగా మోదీ దిష్టిబొమ్మ‌ల ద‌హ‌నాలు, ర్యాలీల‌తో హోరెత్తించింది.

తెలంగాణ ఏర్పాటుపై రెండు రోజుల క్రితం రాజ్య‌స‌భ‌లో మోదీ చేసిన వ్యాఖ్య‌లు రాజ‌కీయ దుమారం సృష్టించాయి. మోదీ రాజ్య‌స‌భ‌లో రాష్ట్ర‌ప‌తి ప్ర‌సంగంపై మాట్లాడుతూ కాంగ్రెస్ ను టార్గెట్ చేశారు. దేశ విభ‌జ‌న జ‌రిగిన నాటి నుంచీ.. ఇందిరాగాంధీ పాల‌న నుంచీ.. క‌రోనా కాలం వ‌ర‌కు జ‌రిగిన ప‌రిణామాల‌పై కాంగ్రెస్ ను ఏకిపారేశారు. ఇందిరా, సోనియా, రాహుల్ ను తీవ్రంగా విమ‌ర్శించారు.

ఇంత వ‌ర‌కు బాగానే ఉన్నా.. మోదీ ప్ర‌సంగంలో అనూహ్యంగా ప్ర‌త్యేక తెలంగాణ ఏర్పాటు అంశం వ‌చ్చింది. ఏపీ ప్ర‌జ‌ల‌కు కాంగ్రెస్ అన్యాయం చేసింద‌ని.. పార్ల‌మెంటులో మైకులు బంద్ చేసి.. పెప్ప‌ర్ స్ప్రే వాడి విభ‌జ‌న బిల్లును ఆమోదించార‌ని ఆరోపించారు. పార్ల‌మెంటు త‌లుపుల‌ను మూసి.. చ‌ర్చ జ‌ర‌గ‌కుండానే బిల్లును పాస్ చేశార‌ని వ్యాఖ్యానించారు. మోదీ వ్యాఖ్య‌ల‌పై తెలంగాణ‌లో పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. ప్ర‌తిప‌క్షాలు ఈ అంశాన్ని సీరియ‌స్ గా తీసుకున్నాయి. కేంద్రంపై ఎదురుదాడికి దిగాయి.

ఈ విష‌యంలో టీఆర్ఎస్ ముందంజ‌లో ఉంది. వ‌చ్చిన అవ‌కాశాన్ని రెండు చేతులా ప‌ట్టుకుంది. తెలుగు రాష్ట్రాల‌ను మ‌ళ్లీ క‌లిపే కుట్ర‌లో భాగంగా మోదీ అలా మాట్లాడార‌ని ఆరోపించింది. ప్ర‌జ‌ల్లో సెంటిమెంటును రాజేసింది. ఆ పార్టీ నేత‌లు అన్ని జిల్లాల్లో మోదీ దిష్టిబొమ్మ‌ల‌ను త‌గుల‌బెట్టారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇత‌ర ముఖ్య నేత‌లు అంద‌రూ ప్ర‌ధాన ర‌హ‌దారుల‌పై ర్యాలీలు నిర్వ‌హించారు.

అయితే.. ఈ విష‌యంలో కాంగ్రెస్ వెనుక‌ప‌డిన‌ట్లుగా తెలుస్తోంది. ఆ పార్టీ సీనియ‌ర్ నేత‌లు కొంద‌రు మీడియా స‌మావేశాలు నిర్వ‌హించి మోదీని విమ‌ర్శించారు. సోనియాను, తెలంగాణ ప్ర‌జ‌ల‌ను అవ‌మానించార‌ని ఆరోపించారు. కానీ స్వ‌యంగా రోడ్ల‌పైకి వ‌చ్చి హ‌డావుడి చేసింది ఒక‌రిద్దరు నేత‌లు మాత్ర‌మే. జిల్లాల్లో చోటా మోటా నాయ‌కులు ఆందోళ‌న‌లు నిర్వ‌హించినా గులాబీ పార్టీకి వ‌చ్చిన మైలేజీ మాత్రం రాలేదు. ఇలాంటి విష‌యంలోనైనా పార్టీ నేత‌లు క‌లిసిక‌ట్టుగా ఉండి.. సీరియ‌స్ కార్య‌క్ర‌మాలు చేయ‌క‌పోతే ఎలా అని కాంగ్రెస్ నేత‌లు ఆక్షేపిస్తున్నారు.