తెలుగు పోస్టర్ ఎక్కడ సూర్యా?

తెలుగు పోస్టర్ ఎక్కడ సూర్యా?

సూపర్ స్టార్ రజనీకాంత్, లోకనాయకుడు కమల్ హాసన్‌ల తర్వాత తెలుగు ప్రేక్షకులు అత్యంత ఓన్ చేసుకున్న తమిళ కథానాయకుడు సూర్యానే. ‘గజిని’ సినిమాతో అతడికి తెలుగులో తిరుగులేని ఫాలోయింగ్ వచ్చింది. ఆ తర్వాత ‘సింగం’ సిరీస్ సినిమాలు సూర్యకు ఇక్కడ ఆదరణ మరింత పెంచాయి. ఐతే ఈ మధ్య అటు తమిళంలో.. ఇటు తెలుగులో సూర్య సినిమాలు అనుకున్న స్థాయిలో ఆడట్లేదు. చివరగా సూర్య నుంచి వచ్చిన ‘గ్యాంగ్’ ఫ్లాప్ అయింది. ఆ సినిమాకు అనుకున్న స్థాయిలో బిజినెస్ జరగలేదు. వసూళ్లూ అంతంతమాత్రమే వచ్చాయి. ఒకప్పుడు సూర్య సినిమాకు తెలుగులో రూ.20 కోట్ల దాకా బిజినెస్ జరిగేది. ఇప్పుడు రూ.10 కోట్లు కూడా కష్టమే అన్నట్లుంది పరిస్థితి. ప్రస్తుతం తమిళంలో సూర్య రెండు సినిమాలు చేస్తున్నాడు.

ఒకటి సెల్వ రాఘవన్ దర్శకత్వంలో ‘ఎన్జీకే’ కాగా.. ఇంకోటి కె.వి.ఆనంద్ డైరెక్షన్లో ‘కాప్పన్’. ‘ఎన్జీకే’ సినిమా మొదలై చాలా కాలం అయింది. ఈపాటికే రిలీజవ్వాల్సింది కూడా. కానీ అనుకోని కారణాలతో ఆలస్యమైంది. ఈ లోపు ‘కాప్పన్’ సినిమాను మొదలుపెట్టి చకచకా పూర్తి చేస్తున్నాడు. నూతన సంవత్సర కానుకగా ఈ చిత్ర టైటిల్.. ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. మామూలుగా సూర్య తన ప్రతి సినిమాకు సంబంధించిన అప్ డేట్ కూడా తమిళంతో పాటు తెలుగులోనూ రిలీజ్ చేస్తుంటాడు. కానీ ‘కాప్పన్’ విషయంలో మాత్రం సంప్రదాయం తప్పాడు. మరి ఈసారి ఎందుకిలా చేశాడని తెలుగు అభిమానులకు అర్థం కావడం లేదు. తెలుగులో మార్కెట్ పడిపోవడం చూసి ఇక్కడి జనాలపై ప్రేమ తగ్గిపోయిందా అని చర్చించుకుంటున్నారు. ఇంతకుముందు సూర్య-కె.వి.ఆనంద్ కాంబినేషన్లో వచ్చిన ‘వీడొక్కడే’ పెద్ద హిట్టవగా.. ‘బ్రదర్స్’ నిరాశ పరిచింది. ‘కాప్పన్’లో మోహన్ లాల్.. ఆర్య కీలక పాత్రలు పోషిస్తుండటం విశేషం. ఈ చిత్రం పూర్తిగా విదేశాల్లోనే నడుస్తుందట. ఇదొక స్పై థ్రిల్లర్ అని సమాచారం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English