ఎన్టీఆర్‌ బయోపిక్‌కి బాలకృష్ణ సెగ!

ఎన్టీఆర్‌ బయోపిక్‌కి బాలకృష్ణ సెగ!

తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం జరుగుతోన్న సమయంలో రాష్ట్ర విభజనకి వ్యతిరేకంగా వున్న హీరోలు కమ్‌ రాజకీయ నాయకుల చిత్రాలకి నైజాంలో ఇబ్బంది ఏర్పడేది. అయితే ఒకసారి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సినిమా వాళ్లకి ఎలాంటి ఇబ్బందులూ లేవు.

అయితే ఇటీవలి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో తెలుగుదేశం తరఫున ప్రచారం చేసిన బాలకృష్ణ పలుమార్లు హద్దులు దాటారు. కెసిఆర్‌, కెటీఆర్‌పై విమర్శలు గుప్పిస్తూ వాళ్లని ఆంధ్రప్రదేశ్‌లో అడుగు పెట్టనివ్వమన్నట్టు స్టేట్‌మెంట్స్‌ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ తమ రాష్ట్ర రాజకీయాల్లో వేలు పెట్టడం కెసిఆర్‌ కుటుంబానికి అస్సలు నచ్చలేదని, వారు మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడుతోన్న దానిని బట్టే అర్థమవుతోంది.

ముఖ్యంగా నందమూరి బాలకృష్ణతో వున్న సంబంధాలయితే పూర్తిగా తెగిపోయాయి. గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రానికి తెలంగాణలో పన్ను రాయితీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఎన్టీఆర్‌ బయోపిక్‌కి మాత్రం టికెట్‌ రేట్లు పెంచుకునే వెసులుబాటు కానీ, ప్రీమియర్‌ షోలు వేసుకునే వీలు కానీ, పండుగ వేళ అయిదు షోలు పెట్టుకునే సౌకర్యం కానీ వచ్చే అవకాశాలు లేవు.

అధికారంలోకి వచ్చిన ఆనందం కంటే తెలుగుదేశం నాయకులకి, ముఖ్యంగా చంద్రబాబు, బాలయ్యలకి తగిన గుణపాఠం నేర్పించాలనే కృత నిశ్చయం కెసిఆర్‌, కెటీఆర్‌ మాటల్లో ప్రతిధ్వనిస్తోన్న నేపథ్యంలో ఎన్టీఆర్‌ బయోపిక్‌కి ప్రభుత్వం తరఫు నుంచి ఎలాంటి సహాయ సహకారాలు అందకపోవచ్చు. ఏపీలో ఎలాంటి ఇబ్బందులు ఏర్పడవు కానీ నైజాంలో మాత్రం బాలకృష్ణ సినిమాలకి ఇదో తీరని తలపోటే అనుకోవచ్చు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English