పవన్‌కు "ముందస్తు" సినిమా లేదా...?

పవన్‌కు

తెలంగాణలో ఎన్నికల నగారా మోగింది. రాజకీయ పార్టీలన్నీ వ్యూహ రచనలో తలమునకలవుతున్నాయి. అధికార తెలంగాణ రాష్ట్ర సమితి ఏకంగా అభ్యర్దులను ప్రకటించేసింది. భారతీయ జనతా పార్టీ అదే పనిలో ఉంది. అయితే జనసైనికుడు, మెగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మాత్రం ఇంతవరకూ పెదవి విప్పలేదు. తనకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండూ సమానమేనంటూ ప్రకటనలు గుప్పించిన పవన్ తెలంగాణలో తన ఎన్నికల సినిమా విడుదలకు ముందుకు రావడం లేదు. తెలుగు రాష్ట్రాలలో తమ సత్తా చాటుతామని, జనసేన నిర్ణాయక స్థితికి వస్తుందంటూ పవన్ కల్యాణ్ గతంలో ప్రకటించారు. తనకూ తెలంగాణ ఉద్యమం ఎంతో స్పూర్తినిచ్చిందని, ఇక్కడి ప్రజల నుంచే తాను ఉద్యమించడం నేర్చుకున్నానని పవన్ కల్యాణ్ పేర్కున్నారు. తెలంగాణలో తనకు ఎంతో మంది అభిమానులు ఉన్నారని వారంతా జనసేన వైపు ఉంటారని పవన్ చెప్పారు. అయితే ముందస్తుపై ఇంత హ‌డావుడి జరుగుతున్నా పవన్ కల్యాణ్ తనకేమి పట్టనట్లుగానే ఉన్నారు.


ఇంతకు ముందు తెలంగాణ రాష్ట్ర సమితిని, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావును పవన్ కల్యాణ్ పొగిడిన సందర్భాలు అనేకం ఉన్నాయి. దీంతో పవన్ కల్యాణ్ అధికార తెలంగాణ రాష్ట్ర సమితికి అనుకూలంగా పనిచేస్తారా అని అనుమానాలు ఉన్నాయి. దీనికి అనుగుణంగానే పవన్ కల్యాణ్ కూడా వ్యవహరిస్తున్నారని అంటున్నారు. జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్‌లోనే ఎన్నికల బరిలోకి దిగుతుందని తెలంగాణలో మాత్రం అధికార తెలంగాణ రాష్ట్ర సమితికి అనధికారికంగా మద్దతు పలుకుతుందని రాజకీయ వర్గాల‌లో చర్చ జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పవన్ కల్యాణ్ తెలంగాణలో కూడా అదే విధానాన్ని అవలంభిస్తారంటున్నారు. తొలి నుంచి కాంగ్రెస్‌కు బద్ద వ్యతిరేకి అయిన పవన్ కల్యాణ్ తెలంగాణలో కాంగ్రెస్తో కలసి పోటి చేయడాన్ని కూడా వ్యతిరేకిస్తున్నారు. ఈ పరిణామాలన్నీ పవన్ కల్యాణ్ అధికార తెలంగాణ రాష్ట్ర సమితికి అనుకూలించేలా ఉన్నాయి. మొత్తానికి తెలంగాణలో పవన్ కల్యాణ్ ఎన్నికల ముందస్తు సినిమా విడుదలయ్యే  అవకాశాలు కనిపించటం లేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు