రజనీ అల్లుడి తెలివి చూడండి

రజనీ అల్లుడి తెలివి చూడండి

సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా హిట్టయితే కలెక్షన్ల వర్షమే. లాభాలు భారీ స్థాయిలో ఉంటాయి. కానీ ఆయన సినిమా హిట్టవడమే చాలా చాలా కష్టం. గత పదేళ్లలో ఆయన్నుంచి వచ్చిన ఏకైక హిట్ సినిమా ‘రోబో’. మిగతావన్నీ డిజాస్టర్లే. రజనీ సినిమా హిట్టయితే లాభాల విషయంలో రికార్డులు నమోదైనట్లే.. ఫ్లాప్ అయితే నష్టాల విషయంలోనూ రికార్డులు బద్దలవుతుంటాయి.

సూపర్ స్టార్ సినిమా తేడా వచ్చిన ప్రతిసారీ బయ్యర్లు రోడ్డున పడటం.. పరిహారం కోసం గొడవ చేయడం మామూలే. ‘బాబా’తో పాటు ఇంకో రెండు మూడు సినిమాలకు నష్టాలు భర్తీ చేయడం ద్వారా ఈ సంప్రదాయాన్ని ఆయన ప్రోత్సహించారు. దీంతో ఆ తర్వాత కూడా బయ్యర్లు ఇదే బాటలో సాగుతున్నారు. ఐతే ‘కబాలి’ విషయంలో మాత్రం రజనీ బయ్యర్లను పట్టించుకోకుండా ఊరుకుండిపోయారు. ఆ సినిమాకు కనీసం ఓపెనింగ్స్ అయినా వచ్చాయి.

కానీ రజనీ కొత్త సినిమా ‘కాలా’కు మాత్రం ఓపెనింగ్స్ కూడా కరవయ్యాయి. రజనీ గత సినిమాలతో పోలిస్తే దీన్ని తక్కువ మొత్తానికే అమ్మినా.. నష్టాలు తప్పలేదు. ఐతే ఈ చిత్ర నిర్మాత.. రజనీ అల్లుడు కూడా అయిన ధనుష్ మాత్రం ‘కాలా’కు నష్టాలే రాదని బుకాయిస్తున్నాడు. సినిమా ఆడలేదని.. నష్టాలొచ్చాయని ఒప్పుకుంటే.. బయ్యర్లను ఆదుకోవాల్సి వస్తుందని.. అసలు ఈ చిత్రానికి నష్టాలు ఎక్కడొచ్చాయి అని ప్రశ్నిస్తున్నాడతను. ‘కాలా’కు రూ.40 కోట్ల నష్టాలొచ్చాయని.. ఇందులో కొంతమొత్తం నిర్మాత ధనుష్ బయ్యర్లకు భర్తీ చేస్తాడి ఒక పత్రికలో వచ్చిన కథనాన్ని ఖండించాడు.

అంతే కాదు.. ‘కాలా’ మంచి విజయం సాధించి తన సంస్థకు మంచి పేరు తెచ్చిందని అతను స్టేట్మెంట్ ఇచ్చాడు. మొత్తానికి బయ్యర్లు నోరెత్తకుండా ఒక్క స్టేట్మెంట్‌తో పని కానిచ్చేశాడని.. ఎంతైనా రజనీ అల్లుడి తెలివే తెలివని అంటున్నారు కోలీవుడ్ జనాలు. గతంలో కొలవెరి పాటతో వచ్చిన క్రేజ్‌ను క్యాష్ చేసుకుని ‘3’ సినిమాను అయిన కాడికి అమ్మి సొమ్ము చేసుకుని.. నష్టాల పాలైన బయ్యర్లను ఏమాత్రం ఆదుకోకుండా అప్పట్లో విమర్శలు ఎదుర్కొన్నాడు ధనుష్.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English