దీని గురించా నాగ్ అంత చెప్పింది

దీని గురించా నాగ్ అంత చెప్పింది

రామ్ గోపాల్ వర్మ సినిమాలు ఎలా ఉన్నా.. దర్శకుడిగా ఫెయిలైనా.. టెక్నీషియన్‌గా అతడికి తిరుగులేదన్న అభిప్రాయం ఉండేది ఒకప్పుడు. తన ప్రతి సినిమా కూడా సాంకేతికంగా ఉన్నతంగా ఉండేలా చూసుకునేవాడు వర్మ. దర్శకుడిగా వర్మ తొలి సినిమా ‘శివ’లో టెక్నికల్‌గా వర్మ చూపించిన బ్రిలియన్సే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కెమెరా వర్క్.. సౌండ్ డిజైన్.. అన్నీ కూడా అప్పటి ప్రేక్షకులకు షాకింగ్‌గా అనిపించాయి. ఆ తర్వాత కూడా చాలా సినిమాల్లో ఈ బ్రిలియన్స్ చూపిస్తూ వచ్చాడు వర్మ. బాలీవుడ్ ఫిలిం మేకర్లకు కూడా ఈ విషయంలో వర్మ పాఠాలు చెప్పాడు తన సినిమాల ద్వారా. ఐతే మొదట్లో కొత్తగా ఉన్నది ఏదైనా.. తర్వాత తర్వాత మొహం మొత్తడం కామన్. వర్మ విషయంలోనూ అదే జరిగింది.

వర్మ కెమెరా యాంగిల్స్.. ఆయన సినిమాల్లో సౌండ్ డిజైన్ ఒక దశ వరకు బాగానే అనిపించాయి. కానీ తర్వాత అవే చికాకు పుట్టించడం మొదలయ్యాయి. కథ ఏదైనా సరే.. ఈ అంశాలు మాత్రం ఒకే రకంగా ఉంటుండటంతో జనాలకు బోర్ కొట్టేసింది. ఒక గదిలో సన్నివేశం నడుస్తుంటో ఎవ్వరూ ఊహించిన చోటి నుంచి కెమెరా పెట్టడం.. అక్కడి నుంచి చిత్ర విచిత్రంగా కెమెరాను ముందుకు తీసుకెళ్లడం.. నటీనటుల్ని మరీ క్లోజప్‌లో చూపించడం.. చిన్న చిన్న శబ్దాలు కూడా వినిపించేలా చేయడం.. ఇవన్నీ కూడా రాను రాను జనాలకు మామూలైపోయాయి. ఇంకా చెప్పాలంటే చికాకు పుట్టించడం మొదలయ్యాయి. వర్మ కొత్త సినిమా ‘ఆఫీసర్’లో కెమెరా యాంగిల్స్.. సౌండ్ డిజైనింగ్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది.

వర్మ మరీ శ్రుతి మించి పోయాడీసారి. ఒక సీన్లో షూకి కెమెరా అంటించి అక్కడి నుంచి దృశ్యాన్ని చూపిస్తారు. ఆ సన్నివేశం ఎంత చికాకు పెడుతుందో చెప్పలేం. ఇక ‘ఎక్స్‌పీరియన్స్ ద సౌండ్’ అంటూ పోస్టర్ మీద వేసి.. దాని గురించి వర్మ, నాగ్ ఓ గొప్పలు పోయారు. అందులోనూ కొత్తదనం ఏమీ లేదు. డోర్ తీసుకుని ఒక వ్యక్తి లోపలికి వచ్చాక.. దాని తాలూకు శబ్దం పూర్తిగా ఆగే వరకు వినిపించడం.. పేపర్ తిప్పినపుడు ఆ సౌండ్ స్పష్టంగా వినిపించేలా చేయడం.. ఇదీ వర్మ చూపించిన ప్రత్యేక శ్రద్ధ. ఇవన్నీ ప్రేక్షకులకు కొత్త అనుభూతినేమీ ఇవ్వలేదు. అయినా సినిమాలో విషయం లేనపుడు ఇలాంటి విషయాలపై ఎంత శ్రద్ధ పెడితే ఏంటి?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు