పవన్-త్రివిక్రమ్‌‌లపై అంత కసేమిటో..?

పవన్-త్రివిక్రమ్‌‌లపై అంత కసేమిటో..?

అన్నిసార్లూ సినిమాలు అనుకున్న ప్రకారం ఆడవు. అంచనాలు తప్పుతుంటాయి. ఆ సందర్భం చూసి ఆయా సినిమాల్లో భాగస్వాములైన వాళ్లపై వ్యతిరేకులు పెద్ద ఎత్తున వ్యతిరేక ప్రచారం చేస్తుంటారు. దొరికారు కదా అని తొక్కడానికి విశ్వ ప్రయత్నం చేస్తుంటారు. ఈ సంక్రాంతికి భారీ అంచనాల మధ్య విడుదలైన తీవ్రంగా నిరాశ పరిచిన‘అజ్ఞాతవాసి’ విషయంలో ఇలాంటి ప్రయత్నాలు చాలానే జరిగాయి.

ఈ సినిమా మీద ఎన్ని వ్యతిరేక వార్తలొచ్చాయో లెక్క లేదు. దీని కంటే ముందు టాలీవుడ్లో చాలా సినిమాలు బయ్యర్లను నిండా ముంచాయి. ఆ సినిమాల విషయంలో బయ్యర్లకు నిర్మాతలు ఏమాత్రం సెటిల్ చేసింది లేదు. కానీ ‘అజ్ఞాతవాసి’ నిర్మాత రాధాకృష్ణ మాత్రం వారం తిరక్కుండానే బయ్యర్ల నష్టాల్ని భర్తి చేయడానికి ముందుకొచ్చారు. తన వంతుగా ఎంతో కొంత ఇవ్వడానికి ప్రయత్నించారు.

ఐతే పవన్-త్రివిక్రమ్‌లను వ్యతిరేకించే వాళ్లు మాత్రం నిర్మాతకు వీళ్లిద్దరూ ఏమాత్రం సాయం పట్టడం లేదని.. నష్టాలు భర్తీ చేద్దామంటే వాళ్లు ముందుకు రాలేదని ప్రచారం చేశారు. ఐతే అదంతా అబద్ధమని ఇప్పుడు స్వయంగా త్రివిక్రమే స్పష్టత ఇచ్చాడు. ముగ్గురం కలిసే నష్టాలు భర్తీ చేశామని.. రూ.25 కోట్ల దాకా సెటిల్ చేశామని తెలిపాడు. అందులో నిజం లేకపోతే త్రివిక్రమ్ అంత ధైర్యంగా ఆ మాట చెప్పలేడు. అది అబద్ధమైతే బయ్యర్లేమీ ఊరుకోరు.

ఇక ‘అజ్ఞాతవాసి’కి సంబంధించి అసత్య ప్రచారాలు ఈ మధ్య కూడా కొనసాగాయి. త్రివిక్రమ్ తర్వాతి సినిమా ‘అరవింద సమేత వీర రాఘవ’ ఓవర్సీస్ హక్కుల్ని ‘అజ్ఞాతవాసి’ వల్ల నష్టపోయిన యుఎస్ బయ్యర్‌కు ఇవ్వలేదని.. ఇది అన్యాయమని గగ్గోలు పెట్టారు. నిజానికి డీల్ తెగకముందే ఈ ప్రచారాలు నడిచాయి. ఇంకా నిర్మాత రాధాకృష్ణ నిర్మిస్తున్న మరో రెండు సినిమాలకు కలిపి చేసుకుంటున్న డీల్ విషయంలో రకరకాల నెగెటివ్ వార్తలు ప్రచారం చేశారు. కానీ అవన్నీ అబద్ధమని తేలాయి. ‘అజ్ఞాతవాసి’ బయ్యర్‌కే ‘అరవింద..’ హక్కులు డిస్కౌంట్ కింద ఇచ్చారు. ఈ రకంగా ‘అజ్ఞాతవాసి’ బాధితులందరికీ న్యాయం చేసినట్లే అయింది. కానీ జరిగిన ప్రచారాలు మాత్రం వేరు. అయినా పవన్-త్రివిక్రమ్-రాధాకృష్ణలపై ఇంత కసెందుకో అర్థం కాదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English