శ్రీను వైట్లకు ఉన్న కష్టాలు చాలవని..

శ్రీను వైట్లకు ఉన్న కష్టాలు చాలవని..

కొన్నేళ్ల కిందటి వరకు టాలీవుడ్ టాప్ డైరెక్టర్లలో ఒకడిగా ఉండేవాడు శ్రీను వైట్ల. బడా బడా స్టార్లు అతడితో సినిమాలు చేయడానికి తహతహలాడేవాళ్లు. కానీ ఒక దశ దాటాక వరుస బెట్టి ఒకే ఫార్మాట్లో సినిమాలు తీయడం ద్వారా తన కెరీర్‌ను పాడు చేసుకున్నాడు వైట్ల. కేవలం మూడే మూడు సినిమాలు అతడిని శిఖరం నుంచి పాతాళానికి పడేశాయి. వైట్లతో సినిమా చేయడానికి భయపడే స్థితికి చేర్చాయి.

‘మిస్టర్’ తర్వాత కొన్ని నెలల పాటు ఏం చేయాలో పాలుపోని అయోమయంలో పడిపోయాడు వైట్ల. చివరికి అతడి మిత్రుడు రవితేజ కరుణించి సినిమా ఇప్పించాడు. మైత్రీ మూవీ మేకర్స్ లాంటి పెద్ద సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించడానికి ముందుకొచ్చింది. అంతా బాగుంది కానీ.. వైట్లకు ఉన్న కష్టాలు చాలవని.. ఈ సినిమా మొదలయ్యే ముందు వరకు పర్వాలేదనిపించే స్థితిలో ఉన్న రవితేజ సైతం ఇప్పుడు దారుణమైన ట్రాక్ రికార్డుతో తయారయ్యాడు.

టచ్ చేసి చూడు.. నేల టిక్కెట్టు.. ఇలా బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్లతో రవితేజ మార్కెట్ చాలా పడిపోయింది. అతడి సినిమా అంటేనే జనాలకు ఒక నెగెటివ్ ఫీలింగ్ వచ్చేస్తోందిప్పుడు. కేవలం ఫెయిల్యూర్లనే కాదు.. రొటీన్ సినిమాలు చేస్తాడంటూ అతడిపై నెగెటివ్ ముద్ర పడిపోయింది. ఈ నేపథ్యంలో మాస్ రాజా మరో రొటీన్ సినిమాతో వస్తే జనాలకు చిరాకొచ్చేయడం ఖాయం. ఈ స్థితిలో మాస్ రాజాతో చేస్తున్న సినిమాతో వైట్ల కచ్చితంగా వైవిధ్యం చూపించాలి. కానీ అతడిపై అంతగా ఆశలేమీ లేవు.

వైట్ల రొటీన్ సినిమాలకు పెట్టింది పేరు. ఆగడు.. బ్రూస్ లీ లాంటి పెద్ద డిజాస్టర్లు ఎదురైనప్పటికీ మళ్లీ ‘మిస్టర్’ లాంటి రొటీన్ సినిమానే చేశాడు. ఇప్పుడున్న స్థితిలో వైట్ల ఏమంత కొత్తదనం చూపిస్తాడన్న ఆశల్లేవు. పైగా ‘అమర్ ఆంటోనీ అక్బర్’ అనే టైటిల్.. ఇందులో రవితేజ త్రిపాత్రాభినయం చేస్తున్నాడన్న వార్తలు ఇదేమీ కొత్తగా ఉంటుందన్న ఆశలేమీ రేకెత్తించడం లేదు. ‘నేల టిక్కెట్టు’ దెబ్బతో విపరీతమైన ఒత్తిడిలో పడిపోయిన రవితేజ-వైట్ల కలిసి ఎలాంటి సినిమా అందిస్తారో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు