ఇదీ బాబూ నాని రేంజ్..

ఇదీ బాబూ నాని రేంజ్..

గత మూడేళ్లలో ఇంతింతై అన్నట్లుగా ఎదిగిపోయాడు నాని. ‘భలే భలే మగాడివోయ్’ సినిమాలో అతడి పేరు ముందు ‘నేచురల్ స్టార్’ అని వేస్తే చాలామంది కామెడీ చేశారు కూడా. కానీ ఆ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకుని.. ఆ తర్వాత వరుసగా హిట్ల మీద హిట్లు కొడుతూ రియల్ ‘స్టార్’ అనిపించుకున్నాడు నాని. ఇప్పుడు తెలుగులో సూపర్ స్టార్లకు కూడా గట్టి పోటీ ఇచ్చే స్థాయికి చేరుకున్నాడతను.

నాని సినిమాకు యావరేజ్ టాక్ వచ్చినా రూ.25-30 కోట్ల మధ్య షేర్ వచ్చేస్తోంది. అతడి చివరి సినిమా ‘ఎంసీఏ’ అయితే డివైడ్‌ టాక్‌తోనూ రూ.35 కోట్ల షేర్ రాబట్టి సంచలనం సృష్టించింది. సినిమా సినిమాకూ నాని రేంజ్ పెరుగుతోంది. రిలీజ్ కూడా భారీగా ఉంటోంది. థియేటర్ల సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా అమెరికాలో మహేష్ బాబు తర్వాత అత్యధిక మార్కెట్ నానికే ఉందంటే అతిశయోక్తి కాదు.

గత ఏడాది నాని నుంచి వచ్చిన ‘నేను లోకల్’.. ‘నిన్ను కోరి’.. ‘ఎంసీఏ’.. ఈ మూడూ కూడా అమెరికాలో మిలియన్ డాలర్ల క్లబ్బులో చేరాయి. దీంతో అతడి కొత్త సినిమా ‘కృష్ణార్జున యుద్ధం’ను అక్కడ భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు. ఏకంగా 200 స్క్రీన్లలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. మామూలుగా మహేష్ బాబు.. పవన్ కళ్యాణ్.. జూనియర్ ఎన్టీఆర్.. అల్లు అర్జున్ లాంటి సూపర్ స్టార్లకు మాత్రమే ఈ స్థాయిలో స్క్రీన్లు దక్కుతుంటాయి.

నానికి మంచి మార్కెట్ ఉన్నప్పటికీ ఇప్పటిదాకా 200 స్క్రీన్ల మార్కును అందుకోలేదు. రెండున్నరేళ్ల కిందట ‘భలే భలే మగాడివోయ్’ను వంద స్క్రీన్లలో రిలీజ్ చేస్తుంటేనే ఔరా అనుకున్నారు. అది సాహసమే అన్నారు. కానీ ఇప్పుడు 200 స్క్రీన్ల రేంజికి ఎదిగిపోయాడు నాని. దీన్ని బట్టే అతడి రేంజ్ ఎలా పెరిగిందో అర్థం చేసుకోవచ్చు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English