60 కోట్ల మిడిల్ క్లాస్ అబ్బాయి

60 కోట్ల మిడిల్ క్లాస్ అబ్బాయి

నేచురల్ స్టార్ నాని సత్తా ఏంటనేది మరోసారి రుజువైంది. డివైడ్ టాక్‌తో మొదలైనా సరే.. అతడి కొత్త సినిమా ‘మిడిల్ క్లాస్ అబ్బాయి’ సంచలన వసూళ్లతో ఆశ్చర్యపరిచింది. సరైన సినిమాలు లేక థియేటర్లు వెలవెలబోతున్న సమయంలో, క్రిస్మస్ వీకెండ్లో రావడం ఈ సినిమాకు కలిసొచ్చింది అనుకున్నా కూడా ఇది సాధించిన వసూళ్లు అనూహ్యమే. దీనికి తోడుగా రిలీజైన ‘హలో’కు ఫుల్ పాజిటివ్ టాక్ వచ్చినా బాక్సాఫీస్ దగ్గర నిలవలేకపోయింది. కానీ ‘ఎంసీఏ’ మాత్రం అంచనాల్ని మించి వసూళ్లు రాబట్టింది. రెండో వీకెండ్ అయ్యేసరికి.. 12 రోజుల్లో ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ.60 కోట్ల గ్రాస్ సాధించడం విశేషం. షేర్ రూ.35 కోట్లు దాటింది. తెలుగు రాష్ట్రాల వరకే ఈ చిత్రం రూ.46 కోట్లకు పైగా గ్రాస్.. రూ.30 కోట్ల వరకు షేర్ సాధించడం విశేషం.

నైజాం ఏరియాలో పెద్ద హీరోల సినిమాల స్థాయిలో ఈ చిత్రం రూ.13 కోట్ల దాకా షేర్ వసూలు చేయడం ఆశ్చర్యం కలిగించే విషయమే. ఆంధ్రాలో అన్ని ఏరియాలూ కలిపి రూ.12 కోట్లు.. సీడెడ్లో నాలుగున్నర కోట్ల షేర్ సాధించిందీ సినిమా. అమెరికాలో ‘ఎంసీఏ’ మిలియన్ డాలర్ క్లబ్బులోకి చేరడం విశేషం. 2017లో రిలీజైన నాని సినిమాలు మూడూ అక్కడ మిలియన్ మార్కును దాటాయి. ‘ఎంసీఏ’ లాంటి డివైడ్ టాక్ తెచ్చుకున్న, రొటీన్ కంటెంట్ ఉన్న సినిమా ఈ క్లబ్బులోకి చేరడమే ఆశ్చర్యమే. దీన్ని బట్టే నాని రేంజ్ ఏంటన్నది అర్థం చేసుకోవచ్చు. కాకపోతే ‘ఎంసీఏ’ ఆడింది కదా అని నాని ఇదే రూటు ఫాలో అయితే కష్టం. ఈ సినిమాపై వచ్చిన విమర్శల్ని నాని హెచ్చరికగా తీసుకుని ఇకపై తన సినిమాలు భిన్నంగా ఉండేలా చూసుకోవాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు