ఎన్టీఆరూ.. రావయ్యా బాబూ

ఎన్టీఆరూ.. రావయ్యా బాబూ

తెలుగు ‘బిగ్ బాస్’ విషయంలో జనాలు ఏవైతే సందేహాలు వ్యక్తం చేశారో.. అవే నిజమవుతున్నాయి. ఎన్టీఆర్ కనిపించిన ఎపిసోడ్లకు ఢోకా ఉండదు కానీ.. అతను లేని రోజుల్లో ‘బిగ్ బాస్’ పార్టిసిపెట్లు ఈ షోను ఏమాత్రం ఆసక్తికరంగా నడిపిస్తారో అని షో మొదలవడానికి ముందే తెలుగు జనాలు సందేహాలు వ్యక్తం చేశారు. ఆరంభోత్సవం తర్వాత వీక్ డేస్‌లో ఎపిసోడ్లు ఆ సందేహాలకు తగ్గట్లే సాగాయి.

ఏదో నడుస్తోందంటే నడుస్తోంది కానీ.. ఆరంభోత్సవం తర్వాత ఏ ఎపిసోడ్ కూడా అంత ఆసక్తేమీ రేకెత్తించలేదు. ఒక రోజు సంపూ గ్యాంగ్‌ సిగరెట్ తాగినందుకు వార్నింగ్ ఇవ్వడం.. ఇంకో రోజు ఆదర్శ్ ప్రాంక్ యాక్ట్‌తో జనాల్ని బెదరగొట్టే ప్రయత్నం చేయడం.. ఇలాంటివి కొంచెం ఆసక్తి రేకెత్తించినప్పటికీ.. డ్రామా అయితే ఆశించిన స్థాయిలో పండట్లేదు. హిందీ ‘బిగ్ బాస్’లో మాదిరి సెన్సేషనల్ యాక్ట్స్, కాంట్రవర్శీస్ అయితే ఇప్పటిదాకా ఏమీ లేవు. ఆ తరహాలో డ్రామాను రక్తి కట్టించే సామర్థ్యం ఇప్పుడున్న పార్టిసిపెంట్లకు ఉందన్న ఆశ కూడా కలగట్లేదు. నాలుగు రోజులకే ఎపిసోడ్లు బోర్ కొట్టేసి.. ఎన్టీఆర్ ఎప్పుడొస్తాడా అని ఎదురు చూసే పరిస్తితి.

నిన్నటి ఎపిసోడ్ అవ్వగానే.. హమ్మయ్య రేపు ఎన్టీఆర్ వచ్చేస్తాడులే అని నిట్టూర్చేశారు ప్రేక్షకులు. తొలి రోజు ఆరంభోత్సవంలో ఎన్టీఆర్ బాగానే మేనేజ్ చేశాడు కానీ.. అత్యుత్సాహం ఎక్కువైందని, సరైన ప్రిపరేషన్ లేకుండా వచ్చాడని విమర్శలు వ్యక్తమయ్యాయి. పైగా వీక్ డేస్‌లో ఎపిసోడ్లు అంత ఆకట్టుకోలేదన్న విమర్శలు కూడా ఎన్టీఆర్ మీద ప్రెజర్ పెంచేవే. మరి ఈ పరిస్థితుల్లో వీకెండ్లో రెండు రోజులు ఎన్టీఆర్ ఎలా మేనేజ్ చేస్తాడో.. షోను ఎలా రక్తి కట్టిస్తాడో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు