చివరికి 'డీజే'లో విలన్ ఎవరు?

చివరికి 'డీజే'లో విలన్ ఎవరు?

'డీజే'లో విలన్ ఎవరేంటి.. రావు రమేష్ కదా అంటారా? ఇది సినిమాకు సంబంధించిన వ్యవహారం కాదులెండి. ఈ సినిమా చుట్టు నెలకొన్న వివాదాల్లో అందరి కంటే ఎక్కువ చెడ్డ పేరు తెచ్చుకున్నది.. బ్లేమ్ అయినది ఎవరన్నది ఇక్కడ పాయింట్. 'దువ్వాడ జగన్నాథం'కు డివైడ్ టాక్ రావడం.. నెగెటివ్ రివ్యూలు పడటం ఆ చిత్ర బృందానికి ఆగ్రహం తెప్పించడంలో ఆశ్చర్యమేమీ లేదు.

ఐతే టాక్‌తో సంబంధం లేకుండా ఆరంభ వసూళ్లు బాగా వచ్చాయని సంతోషించి.. ఈ నెగెటివిటీని పట్టించుకోవడం మానేసి ఉండాలి. కానీ అందరూ మీడియా మీద.. సినిమాను విమర్శించిన అందరి మీదా పడిపోయారు. ఎంతసేపూ వసూళ్ల విషయం ఎత్తి.. జనాలకు విసుగొచ్చేలా చేశారు. చివరికి మెగాస్టార్ చిరంజీవి అభిమానుల్ని సైతం కవ్వించి.. వాళ్లు ఆందోళన చేసే వరకు పరిస్థితిని తీసుకెళ్లారు. వివాద రహితుడిగా పేరున్న దిల్ రాజు కూడా ఎన్నడూ లేని విధంగా బ్లేమ్ అయ్యాడు.

ఐతే 'ఫిదా' ఆడియో వేడుకలో పూర్తిగా దిగి వచ్చి వివరణ ఇచ్చుకోవడం.. చిరంజీవి గురించి గొప్పగా మాట్లాడటం ద్వారా రాజు తప్పులు మాఫీ అయిపోయాయి. ఇక అల్లు అర్జున్ మీద పవన్ కళ్యాణ్ అభిమానుల్లో ఉన్న వ్యతిరేకత పోయేది కాదు. అది ఎప్పుడూ నిలకడగా ఉంటుంది. చిరంజీవి అభిమానుల్లో ఇప్పుడతను కొంత వ్యతిరేకత ఎదుర్కొన్నాడు. కాకపోతే అల్లు అరవింద్ ఉన్నాడు కాబట్టి వ్యవహారాన్ని డీల్ చేసేస్తాడు. సర్దుబాటు చేసేస్తాడు. కాబట్టి బన్నీకి కూడా మరీ ఇబ్బందేమీ రాకపోవచ్చు.

ఎటొచ్చీ దర్శకుడు హరీష్ శంకర్ పరిస్థితే అయోమయంగా ఉంది. మీడియా విషయంలో మరీ హద్దులు మీరి మాట్లాడి వాళ్లకు శత్రువయ్యాడు. వసూళ్ల విషయంలో సవాళ్లు విసిరి.. మెగా అభిమానుల్లో ఓ వర్గానికి శత్రువయ్యాడు. 'డీజే' పోస్ట్ రిలీజ్ ఈవెంట్లన్నింటిలోనూ అతను అతిగా మాట్లాడన్న అభిప్రాయం జనాల్లోకి వెళ్లిపోయింది. ఈ సినిమాతో అతను ఎంత పేరు సంపాదించాడు.. ఎన్ని అవకాశాలు తెచ్చుకున్నాడో కానీ.. కావాల్సినంత చెడ్డ పేరు మాత్రం మూటగట్టుకున్నాడు. 'డీజే'కు సంబంధించిన వివాదాల్లో అది పెద్ద విలన్ అతనే అయిపోయాడు. మున్ముందు అతడికిది ఇబ్బందికర విషయమే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు