వివాదాస్పద గాయకుడు ట్విట్టర్ నుంచి ఔట్

వివాదాస్పద గాయకుడు ట్విట్టర్ నుంచి ఔట్

తన పాటలతో కంటే ఈ మధ్య ముస్లింలు తెల్లవారుజామున చేసే ప్రార్థన గీతం అజాన్ మీద చేసిన కామెంట్లతో ఎక్కువ పాపులారిటీ సంపాదించాడు బాలీవుడ్ గాయకుడు సోనూ నిగమ్. అతనా కామెంట్లు చేసినప్పటి నుంచి వార్తల్లో ఉంటున్నాడు. ఓ వర్గం వాళ్లు అతడి మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడితే.. మరో వర్గం అతడికి అండగా నిలిచింది.

తన కామెంట్లు ఎంత వివాదాస్పదం అయినప్పటికీ సోనూ ఏమీ తగ్గలేదు. ఆ తర్వాత కూడా అంతే దూకుడుగా మాట్లాడుతున్నాడు. ఐతే తాజాగా అతను సంచలన నిర్ణయం తీసుకున్నాడు. తన ట్విట్టర్ ఖాతాను అతను రద్దు చేసేయాలని నిర్ణయించుకున్నాడు.

గాయకుడు అభిజీత్ భట్టాచార్య వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో అతడి ఖాతాను ట్విట్టర్ రద్దు చేయడాన్ని నిరసిస్తూ సోనూ ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఈ నిర్ణయాన్ని ప్రకటిస్తూ అతను కొన్ని సంచలన ట్వీట్లు పెట్టాడు. ''నా 70 లక్షల మంది ఫాలోవర్లకు గుడ్‌బై. చాలా మందిని నొప్పిస్తూ నేను ట్విటర్‌ నుంచి తప్పుకుంటున్నా. నేను వైదొలగటంతో కొందరు శాడిస్టులు సంతోషంగా ఉంటారు. పై చాలా మంది ప్రేమ, అనురాగం చూపిస్తారు. మరికొందరు అకారణంగా నిందలు వేస్తుంటారు. ఓ ఆర్మీ వాహనం ఎదుట ఓ మహిళ పెట్టిన ఫొటో గురించి ఎవరూ ఏమీ అనలేదు.

కానీ పరేష్ రావల్‌ చేసిన ట్వీట్‌కు వ్యతిరేకంగా ఆయన్ని తిట్టిపోశారు. అరుంధతి రాయ్‌కి కాశ్మీర్ గురించి ఏ అభిప్రాయమైనా చెప్పే హక్కు ఉంది. అదే సమయంలో కోట్లాది భారతీయులకు ఆమె అభిప్రాయాన్ని తప్పా.. కాదా అని చెప్పే హక్కుండదా? అభిజిత్‌ భట్టాచార్య ఖాతాను సస్పెండ్‌ చేస్తే.. జేఎన్‌యూ విద్యార్థి షెహ్లా ట్విట్టర్‌ ఖాతాను కూడా సస్పెండ్‌ చేయాలి. నేను ట్విటర్‌ వ్యతిరేకిని కాను. అదో గొప్ప సామాజిక మాధ్యమం. ఇది థియేటర్లలో చూసే అశ్లీల చిత్రం లాంటిది. ఒకవైపు మాత్రమే ఆలోచించే ప్రజలున్న దీన్నుంచి తప్పుకోవాలనుకుంటున్నాను. నేనే కాదు.. మనసున్న వారు ఎవరైనా ఇదే చేస్తారు. త్వరగా నా ట్వీట్లను స్క్రీన్ షాట్లు తీసుకోండి. ఎందుకంటే కాసేపటి తర్వాత నా ట్విట్టర్ ఖాతా ఉండదు'' అని సోనూ పేర్కొన్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు