ఇంతకీ ఆ సినిమా సంగతేంటి పవన్?

ఇంతకీ ఆ సినిమా సంగతేంటి పవన్?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం త్రివిక్రమ్ డైరెక్షన్లో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఐతే ఈ సినిమా కంటే ముందుగా పవన్ ఓ సినిమా ప్రారంభోత్సవంలో పాల్గొన్న సంగతి గుర్తుండే ఉంటుంది. ఎ.ఎం.రత్నం నిర్మాణంలో తమిళ దర్శకుడు నీశన్ దర్శకత్వంలో ముహూర్తం జరుపుకున్న సినిమా అది. తమిళ సూపర్ హిట్ ‘వేదాళం’కు అది రీమేక్ అని చెప్పుకున్నారు.

ఐతే ముందు ప్రారంభోత్సవం జరుపుకున్న దాన్ని పక్కన పెట్టి ‘కాటమరాయుడు’ తర్వాత త్రివిక్రమ్ సినిమాను మొదలుపెట్టాడు పవన్. ఇది పూర్తయ్యాక అయినా పవన్.. నీశన్ సినిమాను సెట్స్ మీదికి తీసుకెళ్తాడేమో అనుకుంటే.. అలా ఏమీ జరిగేట్లు కనిపించడం లేదు.

ఆల్రెడీ మైత్రీ మూవీ మేకర్స్ వాళ్లు పవన్‌తో ఈ ఏడాది ద్వితీయార్ధంలో సినిమా మొదలుపెట్టడానికి సన్నాహాలు చేసుకుంటుంటే.. ఇప్పుడు ‘జాలీ ఎల్ఎల్బీ-2’ రీమేక్ తెరమీదికి వచ్చింది. నీశన్ సినిమా అసలు ఎక్కడా చర్చల్లోనే లేదు. ‘జిల్లా’ లాంటి సూపర్ హిట్ తీసిన నీశన్.. అప్పట్నుంచి మరో సినిమా ఒప్పుకోలేదు. పవన్ సినిమా కోసమే వెయిటింగ్‌లో ఉన్నాడు. మరోవైపు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రత్నం సైతం పవన్ సినిమానే నమ్ముకున్నాడు.

కానీ పవన్ మాత్రం ఈ సినిమా మీద దృష్టిపెడుతున్నట్లే కనిపించట్లేదు. ‘కాటమరాయుడు’ ఒరిజినల్ ‘వీరం’ లాగే ‘వేదాలం’ కూడా రొటీన్ సినిమా. కాబట్టే ఆ రీమేక్‌లో నటించొద్దని పవన్ అభిమానులు కూడా కోరుకుంటున్నారు. మరి పవన్ కూడా అలాగే ఆలోచిస్తున్నాడో ఏంటో మరి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు